అంతర్జాతీయ రియల్‌దందా! | International Real danda | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ రియల్‌దందా!

Published Tue, Dec 29 2015 1:24 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

అంతర్జాతీయ రియల్‌దందా! - Sakshi

అంతర్జాతీయ రియల్‌దందా!

♦ బట్టబయలవుతున్న ‘ప్రైవేట్’ వ్యవహారం
♦ ప్రభుత్వ సంస్థకు టో యెంగ్ రాజీనామాతో కీలక మలుపు
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందంటూ మొదటినుంచీ వ్యక్తమవుతున్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తామంటూ నిరుపేద రైతుల నుంచి 34 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని తమకు అనుకూలమైన కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాజధాని వెనుక రూ.లక్ష కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం దాగి ఉందన్న అనుమానాలను బలపరుస్తూ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

తనకున్న పలుకుబడి, బ్రాండ్ ఇమేజ్‌ను చూసి సింగపూర్ ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ) మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా అందిస్తుందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ మేరకు తొలుత సింగపూర్ ప్రభుత్వంతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై ఆ ప్రభుత్వం తరఫున ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ టో యెంగ్ సంతకం చేశారు. తర్వాత కొద్ది కాలానికే ఆ మాస్టర్‌ప్లాన్ తయారు చేసే పని ప్రైవేటు కంపెనీ జురాంగ్, సుర్బానాల చేతిలోకి నిశ్శబ్దంగా జారిపోయింది. ఆ కంపెనీ కళ్లు చెదిరేలా బాహుబలిలాంటి గ్రాఫిక్ చిత్రాలను రాజధాని పేరుతో డిజైన్ చేసింది.

సీన్ కట్ చేస్తే... ఇప్పుడు ప్రభుత్వ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుని జురాంగ్-సుర్బానా (రెండు వేర్వేరు సంస్థలు ఇటీవలే విలీనమయ్యాయి) కంపెనీకి సీఈవోగా టో యెంగ్ కొత్త అవతారాన్ని ఎత్తబోతున్నాడు. అసెండాడస్ అనే కంపెనీకి మాస్టర్ డెవలపర్‌గా బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు ఇప్పటికే రూఢీ అయింది. ఈ అసెండాస్, జురాంగ్-సుర్బానా, మరో కంపెనీ ఒక కన్సార్షియంగా ఏర్పడి రాజధాని వెంచర్‌ణు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సింగపూర్ ప్రైవేటు సంస్థలు ఇక ఏ వ్యవహారాన్నయినా కేవలం రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ)తో నడిపేలా కేబినెట్ ముందుగానే నిర్ణయించింది. ఆ సీఆర్‌డీఏకు చైర్మన్ సాక్షాత్తూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

 టో యెంగ్ మాస్టర్ ప్లాన్!
 రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రభుత్వ పరిధిలోని ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ) తో గతేడాది డిసెంబర్ 8 న ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున అప్పట్లో దాని సీఈవో అయిన టో యెంగ్ చేంగ్ దానిపై సంతకాలు చేశారు. ఇదంతా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య (జీ2జీ) ఒప్పందంగా చెప్పారు. కానీ సంతకాలు చేసి సింగపూర్ వెళ్లిన కొద్దిరోజులకే టో యెంగ్ మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను సింగపూర్‌లోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలైన సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్‌లకు అప్పగించేశారు.

అప్పటినుంచి ఏడాది కాలంలో ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు దశల్లో మాస్టర్ ప్లాన్లు (కేపిటల్ రీజన్ ప్లాన్, కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సీడ్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్) అందించాయి. ఇదిగో రాజధాని అంటూ అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో పంచరంగుల చిత్రాలను చూపించాయి. మాస్టర్‌ప్లాన్ పని పూర్తికాగానే ఆ రెండు కంపెనీలు విలీనమై సుర్బానా-జురాంగ్‌గా ఆవిర్భవించాయి. ఐఈ సీఈవో పదవికి రాజీనామా చేసిన టో యెంగ్ జనవరి ఒకటో తేదీన ఈ కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపడుతున్నారు. అంటే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందంపై సంతకాలు చేసి పనులు స్వీకరించి, ఆ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పిన వ్యక్తి, ఇప్పుడు తాను లబ్ధి చేకూర్చిన సంస్థకే సీఈవోగా చేరబోతున్నారన్నమాట. ఐఈని అడ్డుగా పెట్టుకుని సాగిన ఈ మాస్టర్‌ప్లాన్ వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 ఇక మాస్టర్ డెవలపర్ మాయాజాలం
 సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమంటూ ప్రజలను మాయచేసి ప్రైవేటు సంస్థలకు మాస్టర్‌ప్లాన్ పనులు కట్టబెట్టేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో మాయాజాలానికి తెరలేపనుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ అందడంతో ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఒక మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మాస్టర్ డెవలపర్‌ను త్వరలోనే స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే ఎంపిక చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తాము పోటీపడతామని అదే రోజున సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా సింగపూర్‌కు చెందిన అసెండాస్-సిన్‌బ్రిడ్జి అనే ప్రైవేటు కార్పొరేట్ సంస్థ, సెమ్బ్‌కార్ప్ అనే మరో సంస్థ కలిసి తాము మాస్టర్ డెవలపర్‌గా పనిచేస్తామంటూ ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను దాఖలు చేశాయి. ఇంతకాలం వేర్వేరు కార్పొరేట్ కంపెనీలుగా ఉన్న అసెండాస్, సిన్‌బ్రిడ్జి కంపెనీలు అమరావతి నిర్మాణంకోసమే విలీనమై అసెండాస్-సిన్‌బ్రిడ్జిగా నామకరణం చేసుకోవడం గమనార్హం.

 మరోవైపు మాస్టర్ ప్లాన్లు రూపొందించిన సుర్బానా, జురాంగ్ కంపెనీలు కూడా విలీనమై సుర్బానా-జురాంగ్‌గా ఆవిర్భవించాయి. సింగపూర్  జేటీసీ పేరుతో మరో కంపెనీ ఉంది. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక కన్సార్షియమ్‌గా ఏర్పడి అమరావతి మాస్టర్ డెవలపర్‌గా పనులు దక్కించుకోనున్నాయి. ఆ తర్వాత అసలు మతలబు మొదలవుతుంది. తాము చేసిన పనికి విపరీతమైన లాభాలు కోరతాయి. అమరావతిలో డెవలప్‌మెంట్ చేసినందుకు ప్రతిఫలంగా మూడు వేలకుపైగా ఎకరాల భూములు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్న విషయం తెలిసిందే. మాస్టర్ డెవలపర్ గొంతెమ్మ కోర్కెలకు అనుకూలంగా ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోవడం, ప్రతిఫలంగా వారికి ముడుపులు, బినామీలకు సబ్-కాంట్రాక్టులు... ఇలా ఒక్కొక్కటిగా సాగనున్నాయి.
 
 ఉచితమంటూనే సుర్బానాకు రూ.11.68 కోట్లు
 సింగపూర్‌లో తనకున్న పలుకుబడి, బ్రాండ్ ఇమేజ్‌ను చూసి రాజధాని మాస్టర్ ప్రణాళికను ఉచితంగా రూపొందించేందుకు సింగపూర్ సంస్థలు ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్న గొప్పల్లో వీసమెత్తు నిజం లేదని తేలింది. తొలుత మాస్టర్ ప్రణాళికను సింగపూర్‌కు చెందిన సుర్బానా సంస్థ రూపకల్పన చేసింది. అదే సంస్థకు రూ.11.68 కోట్లు చెల్లించారు. ఎటువంటి టెండర్లు పిలకుండానే సుర్బానా సంస్థకు ఈ బాధ్యతను అప్పగించడాన్ని సీఆర్‌డీఏ సమర్ధించుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement