జమ్మూకశ్మీర్ లో ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజలు ఇంటర్నెట్ లేకుండా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటలకు ఇంటర్నెట్ సేవలు నిలిపోనున్నాయి. అసాంఘిక శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే అవకాశముందని భావించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
బక్రీద్ పండుగ, ఎద్దు మాంసంపై నిషేధం నేపథ్యంలో రెండు రోజుల పాటు డేటా సేవలు నిలిపి వేయాలని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను డీజీపీ(కశ్మీర్) ఎస్ జేఎం గిలానీ ఆదేశించారు. డేటా సేవలు నిలిపివేయడంతో ఇంటర్నెట్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఓపెన్ చేయడం సాధ్యం కాదు.