హత్యానేరాన్ని నీరుగార్చేందుకు మత్తు ప్రాతిపదిక కాబోదు: సుప్రీం
న్యూఢిల్లీ: హత్య చేసిన వ్యక్తి మత్తులో ఆ పని చేశాడనటం.. హత్యా నేరాన్ని అసంకల్పిత హత్యగా పలుచన చేసేందుకు ప్రాతిపదిక కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్య చనిపోయేలా కాల్చడమనే సంఘటన.. అసంకల్పిత హత్య లేదా నిందితుడు మద్యం మత్తులో ఉన్నందున అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు, అనే కేటగిరీ కిందకు వస్తుందనే వాదన ను ఆమోదించడం కష్టమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
నిందితుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడనుకున్నప్పటికీ వంటిపై కిరోసిన్ జల్లి అగ్గిపుల్ల గీసి అంటిస్తే ఆ వ్యక్తి కాలిన గాయూలతో చనిపోయేందుకు అవకాశం ఉందనే వాస్తవం కూడా అతనికి పూర్తిగా తెలుసునని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. చిత్తుగా తాగిన వ్యక్తికి కూడా కొన్నిసార్లు తన చర్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలుస్తుందని న్యాయమూర్తులు కె.ఎస్.రాధాకృష్ణన్, విక్రమజిత్‌సేన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భగవాన్ తుకారాం డాంగేకు దిగువ కోర్టు విధించిన జీవితఖైదును సమర్థించిన ధర్మాసనం, ఈ విషయమై బోంబే హైకోర్టు తీర్పును ధ్రువీకరించింది.