ప్లాన్ రెడీనా.. డాడీ!
ప్లాన్ రెడీనా.. డాడీ!
Published Sun, Aug 18 2013 12:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
ప్రతి వ్యక్తికీ జీవితంలో పిల్లలు కలగడం అనిర్వచనీయమైన అనుభూతి. పుట్టబోతున్నారని తెలిసినప్పటి నుంచే పిల్లల్ని ఇంజనీరో, డాక్టరో చేయాలని కలలు కనడం ప్రారంభిస్తారు. ఇలా కలలు కనడమే కాకుండా వీటికోసం ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవాలి. ఎందుకంటే పిల్లలు పుట్టాక కొన్ని నెలలు లేదా సంవత్సరాలు వారి ఆలనాపాలనతో కొత్తగా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడానికి తగినంత సమయం ఉండదు. అందుకే పిల్లలు కావాలని నిర్ణయించుకున్నప్పుడే వారికోసం ప్రత్యేకంగా ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రారంభించాలి. పిల్లల దీర్ఘకాలిక లక్ష్యాలైన చదువు, పెళ్లి వంటి వాటి గురించి కూడా.
ఎంత తొందరగా మొదలు పెడితే అంత తక్కువ మొత్తంతో ఎక్కువ నిధిని సమకూర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. పొదుపే కాకుండా ఆర్థిక ప్రణాళికలో భాగంగా కొన్ని అనవసర వ్యయాలను కూడా తగ్గించుకోవాలి. మనలో చాలామంది పిల్లల కోసం కనిపించిన బొమ్మలు, పుస్తకాలు కొంటుంటారు. కాని వారు పెద్దవారు అయ్యేకొద్దీ ఇవన్నీ ఉపయోగం లేకుండా పోతుంటాయి. అందుకే పిల్లలకు వ్యయం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
ఇవి ముఖ్యం: మీరు తండ్రి కాబోతున్నారంటే.. కుటుంబ సభ్యులందరికీ తగినంత జీవిత, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అప్పులేమైనా ఉంటే ఆ మొత్తానికీ తగినంత బీమా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి వాటికి తక్కువ ప్రీమియంతో ఉండే టర్మ్ పాలసీలు బెటర్. అంతేకాదు ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే అంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణ లభిస్తుంది. పిల్లలు పుట్టగానే ఆరోగ్య బీమాలో వారి పేర్లను నమోదు చేయించడం మర్చిపోవద్దు. ఇలా పిల్లలను చేర్చేటప్పుడు ఆరోగ్య బీమా మొత్తం పెంచుకోవాలి కూడా. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా క్రమంతప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ పిల్లల ప్రయాణం సాగిపోతుంది. చివరగా గుర్తు పెట్టుకోవాల్సిన మరో మాట ఏంటంటే...వీలునామా. పిల్లలు పుట్టాక వారి పేర్లను వీలునామాలో పొందుపర్చండి. మీ ఆస్తులు, నగదును భార్య, పిల్లలకు ఎలా పంచాలనుకుంటున్నారో తెలియచేస్తూ వీలునామా ముందే తయారు చేసుకోండి. దీనివల్ల అవాంఛనీయ సంఘటన ఏది జరిగినా మీపై ఆధారపడిన వారికి ఎలాంటి సమస్యలు తలెత్తవు.
బీపీ ఉన్నా ప్రీమియం పెరగదు
ప్రభుత్వరంగ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో అధిక చార్జీలను వసూలు చేయకూడదని నిర్ణయించింది. ప్రస్తుత కాలంలో ఈ రెండు సర్వసాధారణమైన వ్యాధులు కావడంతో ఈ రెండింటికి ఇక నుంచి అధిక ప్రీమియం వసూలు చేయడం లేదని ప్రకటించింది. గతంలో ఈ రెండు వ్యాధులు ఉంటే ప్రీమియం పది నుంచి ఇరవై శాతం అధికంగా వసూలు చేసేవారు.
Advertisement
Advertisement