Investment Plan
-
టాటా పవర్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో భారీ పెట్టుబడులు వెచ్చించనుంది. కంపెనీ 105వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదారులకు పెట్టుబడి సంబంధిత అంశాలను వెల్లడించారు.వీటి ప్రకారం కంపెనీ ఈ ఏడాది రూ. 20,000 కోట్ల పెట్టుబడి వ్యయాలకు సిద్ధంగా ఉంది. వీటిలో అధిక శాతం పెట్టుబడులను పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోకు కేటాయించనుంది. మిగిలిన నిధులను విద్యుత్ ప్రసారం, పంపిణీ బిజినెస్‌పై వెచ్చించనుంది. గతేడాది కేటాయించిన రూ. 12,000 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు దాదాపు 67 శాతం అధికంకావడం గమనార్హం!కంపెనీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీలోగల అవకాశాలను అన్వేషించనున్నట్లు టాటా సన్స్‌కు సైతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వీటికి ప్రభుత్వం అవసరమైన అనుమతులను మంజూరు చేసిన అనంతరం ఇందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను 15 గిగావాట్లకు పెంచుకునే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 9 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లక్ష్యాన్ని చేరుకోనుంది.అంతేకాకుండా తమిళనాడులో 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంటును ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈవీ చార్జింగ్ విభాగంపై దృష్టి పెట్టిన కంపెనీ 530కుపైగా పట్టణాలలో 5,500 పబ్లిక్, సొంత అవసరాల చార్జర్లను ఏర్పాటు చేసింది. ఈ బాటలో 86,000కుపైగా హోమ్ చార్జర్లను సైతం నెలకొల్పింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
టాటా మోటార్స్ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక సంవత్సరం 2025 (ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025)లో ఆటోమొబైల్ విభాగంలో సుమారు రూ.43వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఆర్ధిక సంవత్సరం 2024లో టాటా గ్రూప్ మొత్తం దాదాపు రూ. 41,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడుల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల తయారీ, కొత్త టెక్నాలజీలకు గాను సుమారు రూ. 30,000 కోట్లు, టాటా మోటార్స్‌కు రూ. 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టగా.. అందులో మిగిలిన మొత్తాన్ని ఇతర విభాగాలకు ఖర్చు చేసింది. అయితే ఈసారి ఆర్ధిక సంవత్సరం 2025లో మాత్రం పెట్టుబడల మొత్తాన్ని భారీగా పెంచనుందని సమాచారం. టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ ఓ సదస్సులో మాట్లాడుతూ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం రూ. 35,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా ఉత్పత్తిని పెంచనున్నామని, అందుకే ఆర్ధిక సంవత్సరం 2025లో జేఎల్ఆర్ విభాగంపై పెట్టుబడులు ఆరుశాతం పెంచామన్నారు. ఇక తమ లక్ష్యాలకు అనుగుణంగా వచ్చే సంవత్సరం నాటికి తమ ఉత్పత్తుల్ని మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
పిల్లల భవితకు పది సూత్రాలు
పిల్లలు కళ్ల ముందే ఎదిగిపోతుంటారు. చూస్తుండగానే స్కూలు దాటి కాలేజీకి... అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్సులకు వచ్చేస్తుంటారు. చేర్చిన చోట చదువుకోవటం, చక్కని మార్కులు తెచ్చుకోవటం వారి బాధ్యత. మరి సరైన కాలేజీలో చేర్చటం, వారి కెరీర్‌కు తగ్గ ప్రణాళిక వేయటం మన బాధ్యతే కదా? దీనంతటికీ తగిన నిధి కావాలి కదా? ఇలా ఆలోచించే వారిని ఎండోమెంట్ ప్లాన్స్ అనీ.. యులిప్స్ అనీ... మ్యూచ్‌వల్ ఫండ్స్ అనీ పలు సాధనాలు గందరగోళంలో పడేస్తుంటాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, పొదుపు చేయాలనుకున్నా... ఏ సాధనాన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేని పరిస్థితి!!. నిజానికి పెట్టుబడిపై మెరుగైన రాబడినిచ్చే సాధనాల్ని ఎంచుకోవాలన్నా... పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవాలనుకున్నా కొన్ని సూత్రాలున్నాయి. వాటిని ఫాలో అయితే చాలు. పిల్లల విషయంలో ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆ ‘పది’ సూత్రాలనూ వివరించేదే ఈ కథనం... ఎండోమెంట్, యులిప్స్ జోలికొద్దు.. పిల్లల చదువు, పెళ్లిళ్లు మొదలైన లక్ష్యాలకు అనువైనవంటూ ప్రచారంలో ఉన్న ఎండోమెంట్, యులిప్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. వీటిలో కొన్ని పథకాలకు పేరెంట్ కన్నుమూసిన పక్షంలో ప్రీమియంల నుంచి మినహాయింపు ప్రయోజనం ఉంటుందన్న అంశం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. అదొక్కటే కారణంగా వీటిని తీసుకోవడం మంచిది కాదు. కావాలనుకుంటే అందుకు ప్రత్యామ్నాయ సాధనంగా సాధారణ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఈ పథకాల స్వరూపంలో సంక్లిష్టత ఎక్కువే. వీటి పనితీరుకు ప్రామాణికంగా గత చరిత్రంటూ ఉండకపోవటంతో పిల్లల భవిష్యత్ అవసరాలకు తగిన నిధి అందించగలవనే భరోసా కూడా తక్కువ. ఇవన్నీ వీటికి ప్రతికూలాలే. జీవిత బీమా తప్పనిసరి... కుటుంబ పెద్ద జీవిత బీమా పాలసీ తీసుకోవడం మాత్రం తప్పనిసరి. అది కూడా తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. కవరేజీని ఎంచుకునేందుకు కొన్ని లెక్కలున్నాయి. పిల్లల కాలేజీ చదువులు పూర్తయ్యే దాకా ఇంటి ఖర్చులు, పిల్లల వార్షిక స్కూలు ఫీజులు, ట్యూషన్ ఫీజులు మొదలైనవి ప్రస్తుత స్థాయి నుంచి మొత్తం లెక్కేయాలి. పెట్టుబడులకు వేచి చూడొద్దు... పిల్లల చదువుల కోసం పొదుపు, పెట్టుబడులు చేసేందుకు సరైన సమయం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నిజానికి ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం ఏదైనా ఉందంటే.. అది ఇప్పుడు.. ఈ క్షణమే!!. ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచనకు వచ్చిన మరుక్షణం అమలు చేయడం మంచిది. లక్ష్యాలు రెండు... అనవసరమైన సాధనాలను పక్కకు నెట్టేసి.. సరైన జీవిత బీమా పాలసీ తీసుకుని, ఇక ఇన్వెస్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్న తర్వాత.. ఆలోచించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి! నిధి ఎంత కావాలనేది. రెండోది ఎన్నాళ్లలోగా కావాలన్నది. ఇందుకోసం కావాలంటే ఇటీవలే గ్రాడ్యుయేషనో లేదా పీజీనో చేసిన పిల్లల తల్లిదండ్రులతో కాస్సేపు మాట్లాడి ప్రస్తుత చదువు వ్యయాల గురించి ఒక అంచనాకు రావొచ్చు. ద్రవ్యోల్బణం మరిచిపోవద్దు.. ద్రవ్యోల్బణం రేటును ఏటా 6 లేదా 7 శాతంగా లెక్కేస్తుంటారు. కానీ.. పెరిగే చదువుల ఖర్చులను చూస్తుంటే.. ఏటా 8 నుంచి పది శాతం దాకా లెక్కేసుకోవడం మంచిది. ఉన్నత చదువుల వ్యయాలు ప్రతి ఏటా పెరగకపోయినా... మూడు నాలుగేళ్లకోసారి ఎకాయెకిన భారీగా పెరిగిపోతుంటాయని గుర్తుపెట్టుకోవాలి. రాబడిని బట్టే సాధనం ఎంపిక... లక్ష్యం చేరుకోవడానికి ఎంత సమయముంది? చదువుల వ్యయాలెలా ఉంటాయి, ద్రవ్యోల్బణం ఎంత ఉండొచ్చు అనేది తెలుసుకున్న తర్వాత చేయాల్సింది.. మన లక్ష్యాలను నిర్దిష్ట కాలంలోగా చేరుకునేందుకు అనువైన రాబడులిచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాన్ని అన్వేషించడం. ఇందుకోసం ఒక మోస్తరు రాబడి అంచనాలను నిర్దేశించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. డెట్ సాధనాలైతే ఏడు శాతం మేర.. అదే ఈక్విటీల్లోనైతే 10 నుంచి 12% దాకా రాబడి అంచనాలను వేసుకుంటే శ్రేయస్కరం. ఒకవేళ ఈ సాధనాలు ఆశించిన దానికన్నా ఎక్కువ రాబడి ఇస్తే మంచిదేగా! బోనస్లాంటిదేగా!! ఈక్విటీకి... మూడు ఫండ్స్ చాలు డెట్ సాధనాల విషయానికొస్తే... పీపీఎఫ్ (మెచ్యూరిటీ కాలావధి, నిర్దిష్ట లక్ష్యం సాధనకు ఉన్న సమయం ఒకేలా ఉంటే), అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ లేదా షార్ట్ టర్మ్ గిల్ట్ ఫండ్స్ మొదలైనవి పరిశీలించవచ్చు. ఇక ఈక్విటీల విషయానికొస్తే.. ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో కోసం మూడు ఫండ్స్ సరిపోతాయి. ఒకవేళ డెట్, ఈక్విటీల కోసం వేర్వేరు సాధనాలు వద్దు అనుకుంటే.. ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ని కూడా ఎంచుకోవచ్చు. సాధారణంగా ఈ ఫండ్స్‌లో ఈక్విటీ, డెట్ సాధనాలకు 65:35 నిష్పత్తిలో మీ పెట్టుబడులను కేటాయించటం జరుగుతుంది. అయితే, ఆయా ఫండ్ల పనితీరు గురించి ముందుగా అధ్యయనం చేయడం మరవొద్దు. ఎందుకంటే ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఒక్కో దాని పనితీరు ఒక్కో రకంగా ఉంటుంది. కాల వ్యవధి బట్టే కేటాయింపులు... ♦ సాధనాలు కూడా ఎంచుకున్న తర్వాత.. ఏయే సాధనానికి ఎంతెంత కేటాయింపులు జరపాలన్నదీ చూసుకోవాలి. దీనికి లక్ష్యా న్ని సాధించాలనుకునే కాల వ్యవధిని బట్టి ఒక విధానాన్ని పరిశీలించవచ్చు. ♦ ఒకవేళ లక్ష్య కాలవ్యవధి ఐదేళ్ల లోపే ఉంటే.. ఈక్విటీ సాధనాల జోలికెళ్లొద్దు. ఎఫ్డీలు, ఆర్డీలు లేదా డెట్ ఫండ్స్ వంటి డెట్ సాధనాలు చూసుకోవచ్చు. ♦ అదే కాలవ్యవధి 5 నుంచి పదేళ్లదాకా ఉంటే.. డెట్, ఈక్విటీకి కేటాయింపులు 40:60 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవచ్చు. ♦ వ్యవధి పదేళ్లకు పైగా ఉంటే డెట్‌కి 30 శాతం, ఈక్విటీకి 70 శాతం స్థాయిలో కేటాయింపులు జరపొచ్చు. ♦ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకునేటప్పుడు ఈక్విటీ భాగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ డెట్ భాగాన్ని పెంచుకుంటూ పోవాలి. రెండుమూడేళ్లు వదిలేయండి... పెట్టుబడులు పెట్టిన తర్వాత చేయాల్సినదేమిటంటే... ఒక రెండు మూడేళ్ల పాటు ఏమీ చేయకుండా ఉండటమే! ఆ తర్వాత నుంచి ఏడాదికి ఒకసారైనా పోర్ట్‌ఫోలియో పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలి. పోర్ట్‌ఫోలియోలో సాధనాలకు కేటాయింపులు నిర్దేశించుకున్న నిష్పత్తిలో ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే.. సవరించుకోవాలి. దీని అవసరం పెద్దగా ఉండదని అనుకోవద్దు. మార్కెట్లు పతనమైన పక్షంలో ఇలా సమీక్షించి, తగు విధంగా సర్దుబాట్లు చేసుకోవడం వల్ల గణనీయంగా ప్రయోజనం లభిస్తుంది. ఇన్వెస్ట్ చేస్తే చాలు.. తిరిగి చూసుకోనక్కర్లేదు అనే ఆలోచన పెట్టుకోవద్దు. సమీక్షించుకోవాలి.. సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి. పెళ్లి ప్రణాళికపై అవగాహన ముఖ్యం... ఏదో ఆషామాషీగా కాకుండా.. ఈ విషయం గురించి సరైన అవగాహన ఉండాలి. పెళ్లి ఖర్చులకు కూడబెట్టడం నిజంగానే అవసరమా? తప్పనిసరి లక్ష్యాలైన పిల్లల గ్రాడ్యుయేషన్ చదువులు, మీ రిటైర్మెంట్ అవసరాలు మొదలైన వాటన్నింటికీ కేటాయింపులు జరిపిన తర్వాత కూడా ఇంకా మీ చేతిలో మొత్తం ఏదైనా మిగిలితే అప్పుడు ఈ లక్ష్యానికి నిధి పోగేయడం గురించి ఆలోచించవచ్చు. లేకపోతే లేదు. అనుబంధాల్లో ఒక కీలక అంశమైన ఈ విషయంలో కటువుగా వ్యవహరించడం కష్టమే అయినా ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని మెలగడమే శ్రేయస్కరం. ఏ తల్లిదండ్రికైనా పిల్లలకు మంచి చదువు చెప్పించడం అన్నింటికన్నా ముఖ్యమైన బాధ్యత. పెళ్లి అనేది పిల్లల ఇష్టాన్ని బట్టే ఆధారపడి ఉంటోంది. మరీ కుదరకపోతే సింపుల్‌గా పది వేల కన్నా తక్కువ ఖర్చుతో రిజిస్టర్డ్ మ్యారేజ్లు కూడా చేసుకునే అవకాశాలూ ఉన్నాయి. కానీ చదువు విషయంలో అలా కుదరదు. అందుకే.. మీ దగ్గర మిగులు డబ్బులుంటేనే పిల్లల పెళ్లిళ్ల కోసం అంటూ ప్లానింగ్ చేయొచ్చు. ఇలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పిల్లల భవిష్యత్‌కి ఉపయోగపడే పొదుపు, పెట్టుబడి పెద్ద కష్టమేమీ కాదు. సర్వ రోగ నివారిణిలాగా అన్ని లక్ష్యాలు, అవసరాలకూ పనికొచ్చే ఏకైక సాధనమంటూ లేదు. ఏ సాధనమూ అత్యుత్తమమైనదీ కాదు.. అత్యంత పనికిమాలినదీ కాదు. కాకపోతే.. వాటిని మన లక్ష్యానికి తగ్గట్లుగా ఉండేలా చూసుకోవడంలోనే ఉంటుందంతా. -
‘ఫిషింగ్’ వల ఉంది.. జాగ్రత్త!
అత్యధిక రాబడులిచ్చే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కి ఎంపికయ్యారని అభినందిస్తూ మీకు ఈ మధ్య ఏమైనా మెయిల్స్ వచ్చాయా? ఎవరైనా ఫోన్ చేశారా? ఇదేదో మంచి అవకాశం.. అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. ఇలాంటి వాటిని నమ్మి, ముక్కూ మొహం తెలీని వారికి మీ వ్యక్తిగత వివరాలు అందజేశారంటే... మీరు ‘ఫిషింగ్’ వలలో పడే ప్రమాదముంది. మోసపూరితంగా సంపాదించిన ఈ సమాచారంతో హ్యాకర్లు మీ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయొచ్చు. మీకు తెలియకుండా మీ పేరిట ఆర్థిక లావాదేవీలు జరిపేసి ముంచేయొచ్చు. ఇలాంటి నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించేదే ఈ కథనం... వచ్చే ఐదేళ్లలో సైబర్ నేరాలు రెట్టింపు! ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న అత్యంత తీవ్రమైన సైబర్ నేరాల్లో ఫిషింగ్ లేదా విషింగ్ (వారుుస్ ఆధారిత) స్కామ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. గతేడాది అంతర్జాతీయంగా ఈ తరహా సైబర్ ముఠాలు కొల్లగొట్టింది 3 లక్షల కోట్ల డాలర్లు కాగా... 2021 నాటికి ఇది ఏకంగా రెట్టింపై 6 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోనుందని అంచనా. ప్రతి రోజు 294 బిలియన్ల ఈమెయిల్స్ వెడుతుండగా ..వీటిలో 90 శాతం పనికిరాని, మోసపూరితమైన స్పామ్ మెరుుల్సేనని అధ్యయనాలు చెబుతున్నాయి. 3.73 కోట్ల ఫిషింగ్ ఎటాక్స్ ఉదంతాల్లో 88 శాతం కేసులు.. మెయిల్లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం వల్ల జరిగినవే. ఆన్లైన్లో ప్రతి సెకనుకు 12 మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అంటే ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 10 లక్షల పైగా ఉంటోంది. ఆందోళనకరమైన విషయమేమిటంటే అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఫిషింగ్ పరిమాణంలో 5 శాతం వాటాతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2015లో ఇండియా కేవలం ఫిషింగ్ నేరాల వల్ల 9.1 కోట్ల డాలర్లు నష్టపోయింది. ఆర్థిక నేరాల ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ది 3వ స్థానం. దేశీయంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏకి కూడా సైబర్ నేర సమస్య తప్పలేదు. ఈ మధ్యే అచ్చం ఐఆర్డీఏ అధికారిక వెబ్సైట్లా భ్రమింపజేసే నకిలి సైట్‌ను నేరగాళ్లు సృష్టించారు. ఆ త ర్వాత.. ఐఆర్డీఏఐ నుంచి భారీ మొత్తం ఇవ్వనున్నట్లు.. బాధితులకు మోసపూరిత ఈమెయిల్స్ పంపించారు. ఇలాంటి చర్యలతో భద్రత.. ఇలాంటి ఫిషింగ్, విషింగ్ నేరాల ఉదంతాలతో అప్రమత్తమైన బీమా కంపెనీలు .. వీటి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై కస్టమర్లలో అవగాహన పెంచుతున్నాయి. సైబర్ నేరాలు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే కరపత్రాలను తమ శాఖల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే, తమ వెబ్సైట్ హోమ్ పేజీలోను ఇతరత్రా కీలకమైన పేజీల్లోను పాప్ అప్ బ్యానర్స్ వంటివి ఉంచుతున్నాయి. అలాగే కస్టమర్లకు పంపే ఈమెయిల్స్ కింది భాగంలోను, ఎన్వలప్‌లు, ఇన్లాండ్ లెటర్లలోను ఇలాంటి వాటి గురించిన ప్రత్యేక హెచ్చరికలు ముద్రిస్తున్నాయి. అంతే కాకుండా తమకు కాల్స్ చేసే కస్టమర్లను సైతం ఈ తరహా మోసపూరిత మెయిల్స్, కాల్స్ గురించి హెచ్చరించేలా ఆటోమేటెడ్ ఐవీఆర్ సందేశాలు ఉంచుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు నియంత్రణ సంస్థలు, బీమా కంపెనీలు ఈ నేరాలపై పోరు కోసం కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ.. కస్టమర్లు కూడా నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకుంటేనే వీటిని అరికట్టడం సాధ్యమవుతుంది. కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి.. ఏ కంపెనీ కూడా.. ఖాతా సమాచా రం, పాస్వర్డ్లు, సెక్యూరిటీ క్వశ్చన్ల వెరిఫికేషన్ వంటి కీలకమైన వ్యక్తిగత సమాచారం గురించి అడగదు. ఒకవేళ ఏదైనా అనుమానాస్పద మెయిల్ వచ్చిన పక్షంలో తక్షణం బీమా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి. కంపెనీ తరఫున వచ్చినట్లుగా కనిపించే లేఖల్లో వెరిఫై, అకౌంట్ ప్రాసెస్, అప్డేట్ వంటి పదాలేమైనా ఉంటే జాగ్రత్తగా అప్రమత్తం కావాలి. బీమా సంస్థను సంప్రతించి తెలుసుకోవాలి. -
లక్ష్యంతోనే భవిత
ఏటా లక్షలాది మంది యువతీ యువకులు చదువు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరుతుంటారు. కొలువు లభించగానే ఆదాయం మొదలవుతుంది. పొదుపు చేయడానికీ, పెట్టుబడులు పెట్టడానికీ అప్పటినుంచే అవకాశం ఏర్పడుతుంది. పెట్టుబడులకు సంబంధించి తొలి అడుగు వేయడమే పెద్ద సమస్య. పెట్టుబడులపై భవిష్యత్తులో వచ్చే ప్రయోజనాలపై తగిన అవగాహన లోపించడమే ఇందుకు కారణం. వారిని చైతన్యవంతుల్ని చేస్తే ఈ సమస్యను సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించిన మౌలిక సూత్రాల గురించి వివరించడానికి నిపుణులు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఈ పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా శిక్షణ పొందిన వారిలో 40% మంది స్ఫూర్తిపొంది మూడు నెలల్లోనే పెట్టుబడులను ప్రారంభిస్తున్నారు. పెట్టుబడుల ప్రయాణం ముందుకుసాగే కొద్దీ అనుభవం వస్తుంటుంది. అంతా అనుభవపూర్వకంగా తెలుసుకుందామనుకోవడం సరికాదు. ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్వాలి. పెట్టుబడులను ప్రారంభించే తొలినాళ్లలో సాధారణంగా జరిగే పొరబాట్లు ఇవీ... పెట్టుబడుల సాధారణ లక్ష్యాలు అభివృద్ధి, భద్రత, ఆదాయం. అంటే, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడమే పెట్టుబడుల ముఖ్యోద్దేశం. ఆర్థిక లక్ష్యాల విషయంలో స్పష్టత ఉంటే సరైన పెట్టుబడి సాధనాల ఎంపిక సులువవుతుంది. ఆర్థిక లక్ష్యాలను, పెట్టుబడి ప్రణాళికను ఖరారు చేసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. పెట్టుబడి ప్రణాళికల్లో క్రమశిక్షణ అత్యవసరం. క్రమశి క్షణ తప్పితే పెట్టుబడి ప్రణాళిక గాడి తప్పుతుంది. పూర్తిగా అవగాహన ఉన్న ప్రొడక్టుల్లోనే సొమ్ము పెట్టుబడి పెట్టాలి. మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్న ప్రొడక్టుల గురించి ముందుగానే అవగాహన తెచ్చుకోవాలి. రిస్కు ఎక్కువగా ఉండే ప్రొడక్టులపై ఆదాయ అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అసాధారణ లాభాలను ఆఫరుచేసే ప్రొడక్టుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. గణనీయ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్లు ప్రారంభించాలనుకోవడం పొరబాటు. పెట్టుబడులపరంగా చూస్తే ఎంత మొత్తమైనా పెద్ద మొత్తమూ కాదు, చిన్న మొత్తమూ కాదు. ఎంత డబ్బును ఇన్వెస్ట్ చేయాలన్న విషయం ముఖ్యం కాదు. తొలి అడుగు పడడమే అత్యంత ప్రాముఖ్యత కలిగిన విషయం. ఒక విషయం మర్చిపోవద్దు.. పెట్టుబడులకు అత్యంత ఉన్నతమైన రోజు నిన్న. రెండో అత్యుత్తమ దినం నేడు. -
ప్లాన్ రెడీనా.. డాడీ!
ప్రతి వ్యక్తికీ జీవితంలో పిల్లలు కలగడం అనిర్వచనీయమైన అనుభూతి. పుట్టబోతున్నారని తెలిసినప్పటి నుంచే పిల్లల్ని ఇంజనీరో, డాక్టరో చేయాలని కలలు కనడం ప్రారంభిస్తారు. ఇలా కలలు కనడమే కాకుండా వీటికోసం ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవాలి. ఎందుకంటే పిల్లలు పుట్టాక కొన్ని నెలలు లేదా సంవత్సరాలు వారి ఆలనాపాలనతో కొత్తగా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడానికి తగినంత సమయం ఉండదు. అందుకే పిల్లలు కావాలని నిర్ణయించుకున్నప్పుడే వారికోసం ప్రత్యేకంగా ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా ప్రారంభించాలి. పిల్లల దీర్ఘకాలిక లక్ష్యాలైన చదువు, పెళ్లి వంటి వాటి గురించి కూడా. ఎంత తొందరగా మొదలు పెడితే అంత తక్కువ మొత్తంతో ఎక్కువ నిధిని సమకూర్చుకునే వెసులుబాటు కలుగుతుంది. పొదుపే కాకుండా ఆర్థిక ప్రణాళికలో భాగంగా కొన్ని అనవసర వ్యయాలను కూడా తగ్గించుకోవాలి. మనలో చాలామంది పిల్లల కోసం కనిపించిన బొమ్మలు, పుస్తకాలు కొంటుంటారు. కాని వారు పెద్దవారు అయ్యేకొద్దీ ఇవన్నీ ఉపయోగం లేకుండా పోతుంటాయి. అందుకే పిల్లలకు వ్యయం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇవి ముఖ్యం: మీరు తండ్రి కాబోతున్నారంటే.. కుటుంబ సభ్యులందరికీ తగినంత జీవిత, ఆరోగ్య బీమా తీసుకోవాలి. అప్పులేమైనా ఉంటే ఆ మొత్తానికీ తగినంత బీమా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి వాటికి తక్కువ ప్రీమియంతో ఉండే టర్మ్ పాలసీలు బెటర్. అంతేకాదు ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే అంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా రక్షణ లభిస్తుంది. పిల్లలు పుట్టగానే ఆరోగ్య బీమాలో వారి పేర్లను నమోదు చేయించడం మర్చిపోవద్దు. ఇలా పిల్లలను చేర్చేటప్పుడు ఆరోగ్య బీమా మొత్తం పెంచుకోవాలి కూడా. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా క్రమంతప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ పిల్లల ప్రయాణం సాగిపోతుంది. చివరగా గుర్తు పెట్టుకోవాల్సిన మరో మాట ఏంటంటే...వీలునామా. పిల్లలు పుట్టాక వారి పేర్లను వీలునామాలో పొందుపర్చండి. మీ ఆస్తులు, నగదును భార్య, పిల్లలకు ఎలా పంచాలనుకుంటున్నారో తెలియచేస్తూ వీలునామా ముందే తయారు చేసుకోండి. దీనివల్ల అవాంఛనీయ సంఘటన ఏది జరిగినా మీపై ఆధారపడిన వారికి ఎలాంటి సమస్యలు తలెత్తవు. బీపీ ఉన్నా ప్రీమియం పెరగదు ప్రభుత్వరంగ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో అధిక చార్జీలను వసూలు చేయకూడదని నిర్ణయించింది. ప్రస్తుత కాలంలో ఈ రెండు సర్వసాధారణమైన వ్యాధులు కావడంతో ఈ రెండింటికి ఇక నుంచి అధిక ప్రీమియం వసూలు చేయడం లేదని ప్రకటించింది. గతంలో ఈ రెండు వ్యాధులు ఉంటే ప్రీమియం పది నుంచి ఇరవై శాతం అధికంగా వసూలు చేసేవారు.