న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో భారీ పెట్టుబడులు వెచ్చించనుంది. కంపెనీ 105వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదారులకు పెట్టుబడి సంబంధిత అంశాలను వెల్లడించారు.
వీటి ప్రకారం కంపెనీ ఈ ఏడాది రూ. 20,000 కోట్ల పెట్టుబడి వ్యయాలకు సిద్ధంగా ఉంది. వీటిలో అధిక శాతం పెట్టుబడులను పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోకు కేటాయించనుంది. మిగిలిన నిధులను విద్యుత్ ప్రసారం, పంపిణీ బిజినెస్‌పై వెచ్చించనుంది. గతేడాది కేటాయించిన రూ. 12,000 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు దాదాపు 67 శాతం అధికంకావడం గమనార్హం!
కంపెనీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీలోగల అవకాశాలను అన్వేషించనున్నట్లు టాటా సన్స్‌కు సైతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వీటికి ప్రభుత్వం అవసరమైన అనుమతులను మంజూరు చేసిన అనంతరం ఇందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను 15 గిగావాట్లకు పెంచుకునే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 9 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లక్ష్యాన్ని చేరుకోనుంది.
అంతేకాకుండా తమిళనాడులో 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంటును ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈవీ చార్జింగ్ విభాగంపై దృష్టి పెట్టిన కంపెనీ 530కుపైగా పట్టణాలలో 5,500 పబ్లిక్, సొంత అవసరాల చార్జర్లను ఏర్పాటు చేసింది. ఈ బాటలో 86,000కుపైగా హోమ్ చార్జర్లను సైతం నెలకొల్పింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment