పిల్లల భవితకు పది సూత్రాలు | Ten principles of child future | Sakshi
Sakshi News home page

పిల్లల భవితకు పది సూత్రాలు

Published Mon, Sep 25 2017 12:32 AM | Last Updated on Mon, Sep 25 2017 12:32 AM

Ten principles of child future

పిల్లలు కళ్ల ముందే ఎదిగిపోతుంటారు. చూస్తుండగానే స్కూలు దాటి కాలేజీకి... అక్కడి నుంచి ప్రొఫెషనల్‌ కోర్సులకు వచ్చేస్తుంటారు. చేర్చిన చోట చదువుకోవటం, చక్కని మార్కులు తెచ్చుకోవటం వారి బాధ్యత. మరి సరైన కాలేజీలో చేర్చటం, వారి కెరీర్‌కు తగ్గ ప్రణాళిక వేయటం మన బాధ్యతే కదా? దీనంతటికీ తగిన నిధి కావాలి కదా?

ఇలా ఆలోచించే వారిని ఎండోమెంట్‌ ప్లాన్స్‌ అనీ.. యులిప్స్‌ అనీ... మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ అనీ పలు సాధనాలు గందరగోళంలో పడేస్తుంటాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్‌ చేయాలనుకున్నా, పొదుపు చేయాలనుకున్నా... ఏ సాధనాన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేని పరిస్థితి!!. నిజానికి పెట్టుబడిపై మెరుగైన రాబడినిచ్చే సాధనాల్ని ఎంచుకోవాలన్నా... పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవాలనుకున్నా కొన్ని సూత్రాలున్నాయి. వాటిని ఫాలో అయితే చాలు. పిల్లల విషయంలో ఆర్థికపరమైన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆ ‘పది’ సూత్రాలనూ వివరించేదే ఈ కథనం...


ఎండోమెంట్, యులిప్స్‌ జోలికొద్దు..
పిల్లల చదువు, పెళ్లిళ్లు మొదలైన లక్ష్యాలకు అనువైనవంటూ ప్రచారంలో ఉన్న ఎండోమెంట్, యులిప్స్‌ మొదలైన వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. వీటిలో కొన్ని పథకాలకు పేరెంట్‌ కన్నుమూసిన పక్షంలో ప్రీమియంల నుంచి మినహాయింపు ప్రయోజనం ఉంటుందన్న అంశం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. అదొక్కటే కారణంగా వీటిని తీసుకోవడం మంచిది కాదు. కావాలనుకుంటే అందుకు ప్రత్యామ్నాయ సాధనంగా సాధారణ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. ఈ పథకాల స్వరూపంలో సంక్లిష్టత ఎక్కువే. వీటి పనితీరుకు ప్రామాణికంగా గత చరిత్రంటూ ఉండకపోవటంతో పిల్లల భవిష్యత్‌ అవసరాలకు తగిన నిధి అందించగలవనే భరోసా కూడా తక్కువ. ఇవన్నీ వీటికి ప్రతికూలాలే.

జీవిత బీమా తప్పనిసరి...
కుటుంబ పెద్ద జీవిత బీమా పాలసీ తీసుకోవడం మాత్రం తప్పనిసరి. అది కూడా తగినంత కవరేజీ ఉండేలా చూసుకోవాలి. కవరేజీని ఎంచుకునేందుకు కొన్ని లెక్కలున్నాయి. పిల్లల కాలేజీ చదువులు పూర్తయ్యే దాకా ఇంటి ఖర్చులు, పిల్లల వార్షిక స్కూలు ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు మొదలైనవి ప్రస్తుత స్థాయి నుంచి మొత్తం లెక్కేయాలి.

పెట్టుబడులకు వేచి చూడొద్దు...
పిల్లల చదువుల కోసం పొదుపు, పెట్టుబడులు చేసేందుకు సరైన సమయం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు.  నిజానికి ఇన్వెస్ట్‌ చేయడానికి సరైన సమయం ఏదైనా ఉందంటే.. అది ఇప్పుడు.. ఈ క్షణమే!!.  ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఆలోచనకు వచ్చిన మరుక్షణం అమలు చేయడం మంచిది.

లక్ష్యాలు రెండు...
అనవసరమైన సాధనాలను పక్కకు నెట్టేసి.. సరైన జీవిత బీమా పాలసీ తీసుకుని, ఇక ఇన్వెస్ట్‌ చేద్దాం అని నిర్ణయించుకున్న తర్వాత.. ఆలోచించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి! నిధి ఎంత కావాలనేది. రెండోది ఎన్నాళ్లలోగా కావాలన్నది. ఇందుకోసం కావాలంటే ఇటీవలే గ్రాడ్యుయేషనో లేదా పీజీనో చేసిన పిల్లల తల్లిదండ్రులతో కాస్సేపు మాట్లాడి ప్రస్తుత చదువు వ్యయాల గురించి ఒక అంచనాకు రావొచ్చు.

ద్రవ్యోల్బణం మరిచిపోవద్దు..
ద్రవ్యోల్బణం రేటును ఏటా 6 లేదా 7  శాతంగా లెక్కేస్తుంటారు. కానీ.. పెరిగే చదువుల ఖర్చులను చూస్తుంటే.. ఏటా 8 నుంచి పది శాతం దాకా లెక్కేసుకోవడం మంచిది. ఉన్నత చదువుల వ్యయాలు ప్రతి ఏటా పెరగకపోయినా... మూడు నాలుగేళ్లకోసారి ఎకాయెకిన భారీగా పెరిగిపోతుంటాయని గుర్తుపెట్టుకోవాలి.

రాబడిని బట్టే సాధనం ఎంపిక...
లక్ష్యం చేరుకోవడానికి ఎంత సమయముంది? చదువుల వ్యయాలెలా ఉంటాయి, ద్రవ్యోల్బణం ఎంత ఉండొచ్చు అనేది తెలుసుకున్న తర్వాత చేయాల్సింది.. మన లక్ష్యాలను నిర్దిష్ట కాలంలోగా చేరుకునేందుకు అనువైన రాబడులిచ్చే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాన్ని అన్వేషించడం. ఇందుకోసం ఒక మోస్తరు రాబడి అంచనాలను నిర్దేశించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. డెట్‌ సాధనాలైతే ఏడు శాతం మేర.. అదే ఈక్విటీల్లోనైతే 10 నుంచి 12% దాకా రాబడి అంచనాలను వేసుకుంటే శ్రేయస్కరం. ఒకవేళ ఈ సాధనాలు ఆశించిన దానికన్నా ఎక్కువ రాబడి ఇస్తే మంచిదేగా! బోనస్‌లాంటిదేగా!!

ఈక్విటీకి... మూడు ఫండ్స్‌ చాలు
డెట్‌ సాధనాల విషయానికొస్తే... పీపీఎఫ్‌ (మెచ్యూరిటీ కాలావధి, నిర్దిష్ట లక్ష్యం సాధనకు ఉన్న సమయం ఒకేలా ఉంటే), అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ లేదా షార్ట్‌ టర్మ్‌ గిల్ట్‌ ఫండ్స్‌ మొదలైనవి పరిశీలించవచ్చు. ఇక ఈక్విటీల విషయానికొస్తే.. ఒక లార్జ్‌ క్యాప్, ఒక మిడ్‌ క్యాప్, ఒక స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో కోసం మూడు ఫండ్స్‌ సరిపోతాయి.

ఒకవేళ డెట్, ఈక్విటీల కోసం వేర్వేరు సాధనాలు వద్దు అనుకుంటే.. ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ని కూడా ఎంచుకోవచ్చు. సాధారణంగా ఈ ఫండ్స్‌లో ఈక్విటీ, డెట్‌ సాధనాలకు 65:35 నిష్పత్తిలో మీ పెట్టుబడులను కేటాయించటం జరుగుతుంది. అయితే, ఆయా ఫండ్‌ల పనితీరు గురించి ముందుగా అధ్యయనం చేయడం మరవొద్దు. ఎందుకంటే ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఒక్కో దాని పనితీరు ఒక్కో రకంగా ఉంటుంది.

కాల వ్యవధి బట్టే కేటాయింపులు...
సాధనాలు కూడా ఎంచుకున్న తర్వాత.. ఏయే సాధనానికి ఎంతెంత కేటాయింపులు జరపాలన్నదీ చూసుకోవాలి. దీనికి  లక్ష్యా న్ని సాధించాలనుకునే కాల వ్యవధిని బట్టి ఒక విధానాన్ని పరిశీలించవచ్చు.
ఒకవేళ లక్ష్య కాలవ్యవధి ఐదేళ్ల లోపే ఉంటే.. ఈక్విటీ సాధనాల జోలికెళ్లొద్దు. ఎఫ్‌డీలు, ఆర్‌డీలు లేదా డెట్‌ ఫండ్స్‌ వంటి డెట్‌ సాధనాలు  చూసుకోవచ్చు.
అదే కాలవ్యవధి 5 నుంచి పదేళ్లదాకా ఉంటే.. డెట్, ఈక్విటీకి కేటాయింపులు 40:60 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవచ్చు.
వ్యవధి పదేళ్లకు పైగా ఉంటే డెట్‌కి 30 శాతం, ఈక్విటీకి 70 శాతం స్థాయిలో కేటాయింపులు జరపొచ్చు.
♦  గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకునేటప్పుడు ఈక్విటీ భాగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ డెట్‌ భాగాన్ని పెంచుకుంటూ పోవాలి.

రెండుమూడేళ్లు వదిలేయండి...
పెట్టుబడులు పెట్టిన తర్వాత చేయాల్సినదేమిటంటే... ఒక రెండు మూడేళ్ల పాటు ఏమీ చేయకుండా ఉండటమే! ఆ తర్వాత నుంచి ఏడాదికి ఒకసారైనా పోర్ట్‌ఫోలియో పరిస్థితిని సమీక్షించుకుంటూ ఉండాలి. పోర్ట్‌ఫోలియోలో సాధనాలకు కేటాయింపులు నిర్దేశించుకున్న నిష్పత్తిలో ఉన్నాయా లేదా అన్నది చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే.. సవరించుకోవాలి. దీని అవసరం పెద్దగా ఉండదని అనుకోవద్దు. మార్కెట్లు పతనమైన పక్షంలో ఇలా సమీక్షించి, తగు విధంగా సర్దుబాట్లు చేసుకోవడం వల్ల గణనీయంగా ప్రయోజనం లభిస్తుంది. ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. తిరిగి చూసుకోనక్కర్లేదు అనే ఆలోచన పెట్టుకోవద్దు. సమీక్షించుకోవాలి.. సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి.

పెళ్లి ప్రణాళికపై అవగాహన ముఖ్యం...
ఏదో ఆషామాషీగా కాకుండా.. ఈ విషయం గురించి సరైన అవగాహన ఉండాలి. పెళ్లి ఖర్చులకు కూడబెట్టడం నిజంగానే అవసరమా? తప్పనిసరి లక్ష్యాలైన పిల్లల గ్రాడ్యుయేషన్‌ చదువులు, మీ రిటైర్మెంట్‌ అవసరాలు మొదలైన వాటన్నింటికీ కేటాయింపులు జరిపిన తర్వాత కూడా ఇంకా మీ చేతిలో మొత్తం ఏదైనా మిగిలితే అప్పుడు ఈ లక్ష్యానికి నిధి పోగేయడం గురించి ఆలోచించవచ్చు. లేకపోతే లేదు.

అనుబంధాల్లో ఒక కీలక అంశమైన ఈ విషయంలో కటువుగా వ్యవహరించడం కష్టమే అయినా ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని మెలగడమే శ్రేయస్కరం. ఏ తల్లిదండ్రికైనా పిల్లలకు మంచి చదువు చెప్పించడం అన్నింటికన్నా ముఖ్యమైన బాధ్యత. పెళ్లి అనేది పిల్లల ఇష్టాన్ని బట్టే ఆధారపడి ఉంటోంది. మరీ కుదరకపోతే సింపుల్‌గా పది వేల కన్నా తక్కువ ఖర్చుతో రిజిస్టర్డ్‌ మ్యారేజ్‌లు కూడా చేసుకునే అవకాశాలూ ఉన్నాయి. కానీ చదువు విషయంలో అలా కుదరదు. అందుకే.. మీ దగ్గర మిగులు డబ్బులుంటేనే పిల్లల పెళ్లిళ్ల కోసం అంటూ ప్లానింగ్‌ చేయొచ్చు.

ఇలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పిల్లల భవిష్యత్‌కి ఉపయోగపడే పొదుపు, పెట్టుబడి పెద్ద కష్టమేమీ కాదు. సర్వ రోగ నివారిణిలాగా అన్ని లక్ష్యాలు, అవసరాలకూ పనికొచ్చే ఏకైక సాధనమంటూ లేదు. ఏ సాధనమూ అత్యుత్తమమైనదీ కాదు.. అత్యంత పనికిమాలినదీ కాదు. కాకపోతే.. వాటిని మన లక్ష్యానికి తగ్గట్లుగా ఉండేలా చూసుకోవడంలోనే ఉంటుందంతా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement