‘ఫిషింగ్’ వల ఉంది.. జాగ్రత్త!
‘ఫిషింగ్’ వల ఉంది.. జాగ్రత్త!
Published Mon, Nov 21 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
అత్యధిక రాబడులిచ్చే అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌కి ఎంపికయ్యారని అభినందిస్తూ మీకు ఈ మధ్య ఏమైనా మెయిల్స్ వచ్చాయా? ఎవరైనా ఫోన్ చేశారా? ఇదేదో మంచి అవకాశం.. అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే మరోసారి ఆలోచించండి. ఇలాంటి వాటిని నమ్మి, ముక్కూ మొహం తెలీని వారికి మీ వ్యక్తిగత వివరాలు అందజేశారంటే... మీరు ‘ఫిషింగ్’ వలలో పడే ప్రమాదముంది. మోసపూరితంగా సంపాదించిన ఈ సమాచారంతో హ్యాకర్లు మీ బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేయొచ్చు. మీకు తెలియకుండా మీ పేరిట ఆర్థిక లావాదేవీలు జరిపేసి ముంచేయొచ్చు. ఇలాంటి నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించేదే ఈ కథనం...
వచ్చే ఐదేళ్లలో సైబర్ నేరాలు రెట్టింపు!
ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న అత్యంత తీవ్రమైన సైబర్ నేరాల్లో ఫిషింగ్ లేదా విషింగ్ (వారుుస్ ఆధారిత) స్కామ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి.
గతేడాది అంతర్జాతీయంగా ఈ తరహా సైబర్ ముఠాలు కొల్లగొట్టింది 3 లక్షల కోట్ల డాలర్లు కాగా... 2021 నాటికి ఇది ఏకంగా రెట్టింపై 6 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోనుందని అంచనా.
ప్రతి రోజు 294 బిలియన్ల ఈమెయిల్స్ వెడుతుండగా ..వీటిలో 90 శాతం పనికిరాని, మోసపూరితమైన స్పామ్ మెరుుల్సేనని అధ్యయనాలు చెబుతున్నాయి.
3.73 కోట్ల ఫిషింగ్ ఎటాక్స్ ఉదంతాల్లో 88 శాతం కేసులు.. మెయిల్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం వల్ల జరిగినవే.
ఆన్‌లైన్‌లో ప్రతి సెకనుకు 12 మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అంటే ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 10 లక్షల పైగా ఉంటోంది.
ఆందోళనకరమైన విషయమేమిటంటే అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఫిషింగ్ పరిమాణంలో 5 శాతం వాటాతో భారత్ నాలుగో స్థానంలో ఉంది.
2015లో ఇండియా కేవలం ఫిషింగ్ నేరాల వల్ల 9.1 కోట్ల డాలర్లు నష్టపోయింది. ఆర్థిక నేరాల ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో భారత్‌ది 3వ స్థానం.
దేశీయంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏకి కూడా సైబర్ నేర సమస్య తప్పలేదు.
ఈ మధ్యే అచ్చం ఐఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్‌లా భ్రమింపజేసే నకిలి సైట్‌ను నేరగాళ్లు సృష్టించారు. ఆ త ర్వాత.. ఐఆర్‌డీఏఐ నుంచి భారీ మొత్తం ఇవ్వనున్నట్లు.. బాధితులకు మోసపూరిత ఈమెయిల్స్ పంపించారు.
ఇలాంటి చర్యలతో భద్రత..
ఇలాంటి ఫిషింగ్, విషింగ్ నేరాల ఉదంతాలతో అప్రమత్తమైన బీమా కంపెనీలు .. వీటి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై కస్టమర్లలో అవగాహన పెంచుతున్నాయి. సైబర్ నేరాలు ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే కరపత్రాలను తమ శాఖల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే, తమ వెబ్‌సైట్ హోమ్ పేజీలోను ఇతరత్రా కీలకమైన పేజీల్లోను పాప్ అప్ బ్యానర్స్ వంటివి ఉంచుతున్నాయి. అలాగే కస్టమర్లకు పంపే ఈమెయిల్స్ కింది భాగంలోను, ఎన్వలప్‌లు, ఇన్‌లాండ్ లెటర్లలోను ఇలాంటి వాటి గురించిన ప్రత్యేక హెచ్చరికలు ముద్రిస్తున్నాయి.
అంతే కాకుండా తమకు కాల్స్ చేసే కస్టమర్లను సైతం ఈ తరహా మోసపూరిత మెయిల్స్, కాల్స్ గురించి హెచ్చరించేలా ఆటోమేటెడ్ ఐవీఆర్ సందేశాలు ఉంచుతున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు నియంత్రణ సంస్థలు, బీమా కంపెనీలు ఈ నేరాలపై పోరు కోసం కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ.. కస్టమర్లు కూడా నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకుంటేనే వీటిని అరికట్టడం సాధ్యమవుతుంది.
కస్టమర్లు ఇవి తెలుసుకోవాలి..
ఏ కంపెనీ కూడా.. ఖాతా సమాచా రం, పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ క్వశ్చన్ల వెరిఫికేషన్ వంటి కీలకమైన వ్యక్తిగత సమాచారం గురించి అడగదు.
ఒకవేళ ఏదైనా అనుమానాస్పద మెయిల్ వచ్చిన పక్షంలో తక్షణం బీమా కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి.
కంపెనీ తరఫున వచ్చినట్లుగా కనిపించే లేఖల్లో వెరిఫై, అకౌంట్ ప్రాసెస్, అప్‌డేట్ వంటి పదాలేమైనా ఉంటే జాగ్రత్తగా అప్రమత్తం కావాలి. బీమా సంస్థను సంప్రతించి తెలుసుకోవాలి.
Advertisement
Advertisement