
ఈ ఐఫోన్ ‘బంగారం’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారమే కాదు బంగారు వర్ణానికీ ఎవరైనా దాసోహం కావాల్సిందే. గోల్డ్‌మేనియా భారత్‌తోపాటు ప్రపంచ దేశాలకూ వ్యాపించిందని చెప్పడానికి ఆపిల్ ఐఫోన్ 5ఎస్ ఉదాహరణ. ఆపిల్ కంపెనీ తొలిసారిగా బంగారు రంగులో ఐఫోన్ 5ఎస్‌ను రూపొందించింది. చూడగానే ఇట్టే హత్తుకునేలా ఉన్న ఈ ఫోన్ కోసం పలు దేశాల్లో కస్టమర్లు ఎగబడుతున్నారు. ఇంకేముంది సహజంగానే కొరత ఏర్పడింది. ప్రీమియం చెల్లించైనా సరే కొందరు కస్టమర్లు దీనిని చేజిక్కించుకున్నారు. భారత్‌లోనూ ఈ పరిస్థితి రావడం ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రీమియం రూ.20 వేల దాకా వెళ్లొచ్చని ఒక రిటైలర్ వ్యాఖ్యానించారు. కాగా, ఆపిల్ ఎట్టకేలకు భారత్‌లో ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ ధరలను ప్రకటించింది. ఐఫోన్ 5ఎస్ 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500గా నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 5సీ 16 జీబీ మోడల్ ధర రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500 ఉంది. నవంబరు 1 నుంచి ఇవి రిటైల్ మార్కెట్లో లభిస్తాయి.
తొలిసారిగా కొత్త రంగుల్లో..
గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్‌ను రూపొందించారు. బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలినవన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసిన రంగులే. 5ఎస్‌లో బంగారు వర్ణంతోపాటు స్పేస్ గ్రే(బ్లాక్) మోడల్‌ను కూడా కస్టమర్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వైట్ ఎప్పటికీ రాయల్ కలర్ అని ఒక రిటైల్ కంపెనీ ప్రతినిధి అన్నారు. 5సీ రంగులకు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నెలకు 5-6 వేలు..
ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 5 నుంచి 6 వేల ఐఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఆపిల్ ఉత్పత్తులకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. భారత్‌లో ఆవిష్కరణ కాకముందే విదేశాల నుంచి తెప్పించుకునే వారూ ఉన్నారని మొబైల్ ఫోన్ల విక్రయ సంస్థ టెక్నోవిజన్ ఎండీ సికందర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఐఫోన్లు అమ్ముడైనట్లు ఒక అంచనా. 5ఎస్, 5సీ కోసం తమ ఔట్‌లెట్లలో 200 పైగా ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇక ఐఫోన్ కొత్త మోడల్స్ కోసం 500 మందికిపైగా బిగ్-సి వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ చేసినట్టు ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. 200 మంది నగదు చెల్లించారని అన్నారు. ఫోన్ల కోసం 250 రిక్వెస్టులు వచ్చాయని, 50 మంది నగదు చెల్లించారని లాట్ మొబైల్స్ ప్రతినిధి చెప్పారు. కాగా, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఔట్‌లెట్లలోనూ 5ఎస్, 5సీ లభిస్తాయి.