బీజేపీతో పొత్తుపై ఏమంటారు?: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ పార్టీకి చెందిన మైనారిటీ నేతల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు అవకాశం లభిస్తే గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో ఏకాంతంగా భేటీ అయి పొత్తుల ప్రస్తావన చేయాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీల నుంచి పార్టీ పట్ల ఏమైనా వ్యతిరేకత వస్తుందా అన్న అంశంపై పార్టీ నేతల నుంచి ఆయన వివరాలు అడిగారు. సోమ, మంగళవారాల్లో పార్టీ మైనారిటీ నేతలు జాహెద్ ఆలీఖాన్, ఎన్‌ఎండీ ఫారూఖ్, ఎంఏ షరీఫ్, ఎంఏ సలీం, ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ, ముజఫర్ అహ్మద్ తదితరులతో ఇదే అంశంపై ఆయన చర్చలు జరిపారు.
ఈ నేతలు బీజేపీతో పొత్తును వ్యతిరేకించారని, చంద్రబాబు పదేపదే అదే ప్రస్తావన చేయడంతో కొందరు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే మోడీని ప్రధాని కాకుండా చూడాలని సూచిస్తూ గోధ్రా అల్లర్లను ప్రస్తావించారని సమాచారం. గతంలో ఎన్‌డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నపుడు మతతత్వాన్ని ఎజెండాగా పెట్టుకున్న అద్వానీ ప్రధాని పీఠం ఎక్కాలని ప్రయత్నించినా అడ్డుకుని వాజ్‌పేయికి ఆ పదవి కట్టబెట్టారని, టీడీపీలాంటి పార్టీలు ఎన్డీఏలో చేరడం వల్ల బీజేపీ కూడా రానున్న రోజుల్లో మోడీని పక్కనపెట్టడమో, వ్యూహాత్మకంగా తెరవెనక్కి నెట్టడమో జరుగుతుందని బాబు విశ్లేషించారు. తెలంగాణకు కట్టుబడ్డ పార్టీగా బీజేపీ.. అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీలు కలవడం వల్ల ప్రయోజనం ఉంటుందని బాబు విశ్లేషించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పొత్తుల అంశం ప్రాథమిక దశలోనే ఉందనీ ఆయన వివరించారని చెప్పాయి.