ముక్కు సూటిగా మాట్లాడటం.. మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టడం బాలీవుడ్ నటి విద్యాబాలన్ నైజం. త్వరలో 'బేగం జాన్' సినిమాతో ప్రేక్షకులను పలుకరించబోతున్న ఈ అమ్మడు తాజాగా ఓ క్లినిక్ వద్ద కనిపించడం బాలీవుడ్‌లో వదంతులకు తావిచ్చింది. విద్యాబాలన్ గర్భవతి అయిందని, త్వరలోనే ఆమె ఓ బిడ్డను ప్రసవించబోతున్నదని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ విషయంలో ఆమెకు అర్థంలేని ప్రశ్నలు ఎదురవ్వడమూ మొదలైంది. చికాకు పరుస్తున్న ఈ ప్రశ్నలపై 'మిడ్-డే' పత్రికతో మాట్లాడుతూ విద్యాబాలన్ ఘాటుగా స్పందించింది.
'ఇది చాలా చికాకు పరుస్తోంది. నేను ఏదైనా కారణంతో క్లినిక్‌కు వెళ్లి ఉండవచ్చు. పెళ్లి తర్వాత ఓ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లితే.. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఊహాగానాలు మొదలుపెడతారా?' అంటూ ప్రశ్నించింది. 'డర్టీ పిక్చర్' నటి విద్య 2012లో నిర్మాత సిద్ధార్థ రాయ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితం గురించి, ప్రెగ్నెన్సీ గురించి, పిల్లలను ఎప్పుడు కంటారంటూ సంబంధంలేని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారని ఆమె పేర్కొంది. 'ఇది నాకు, నా భర్తకు సంబంధించిన వ్యక్తిగత అంశం. దీంతో ఇతరులకు ఏం సంబంధం లేదు. ఇలా అడుగటం మా వ్యక్తిగత ఏకాంతంలోకి చొరబడటమే. కానీ మన దేశమే అలా తయారైంది. ఇరుగుపొరుగువారు, బంధువులు తరచూ ఇవే అనవసర ప్రశ్నలు అడుగుతుంటారు. మా పెళ్లినాడే మా అంకుల్ ఒకాయన పెళ్లి మండపంలోకి వచ్చి 'నెక్ట్స్‌టైం నేను చూసేటప్పటకీ మీరు ఇద్దరు కాదు ముగ్గురు ఉండాల'ని అన్నాడు. మా పెళ్లి ఫొటోలను కూడా అప్పటికి క్లిక్ చేయలేదు. కనీసం హనీమూన్‌కు ఎక్కడికీ వెళ్లాలో నిర్ణయించుకోలేదు. కానీ ఆయన అలా అనడంతో ఏం చెప్పాలో తోచలేదు. చిన్నగా నవ్వాను' అని విద్యాబాలన్ వివరించింది.
'అయినా, ఈ పిల్లల గోల ఏంటో? నేనేమీ పిల్లల్ని కనే మెషిన్‌ను కాదు. అయినా, ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంది. కాబట్టి ఎవరైనా పిల్లల్ని కనకుంటే వచ్చే నష్టమేమీ లేదు' అంటూ విద్య ముగించింది.
ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అయిందా?
Published Sat, Mar 18 2017 9:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM
Advertisement
Advertisement