చైనా ప్రభుత్వ భవనంపై 'మిలిటెంట్' దాడి..!
- మొత్తం ఐదుగురి మృతి
బీజింగ్: చైనాలోని కల్లోలిత జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఓ ప్రభుత్వ భవనంపై ముగ్గురు సాయుధ మిలిటెంట్లు వాహనంతో దాడి చేసి.. పేలుడు పదార్థాలతో విస్ఫోటనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా కత్తులతో దాడిచేసి ఇద్దరిని చంపారు. దీంతో ముగ్గురు సాయుధులను పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దక్షిణ జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కారకక్స్ కౌంటీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ భవనాలు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ దాడి ఇస్లామిస్టు మిలిటెంట్ల పనేనని చైనా సర్కారు ఆరోపిస్తున్నది.
విఘర్ ముస్లిం తెగ ప్రజలు అధికంగా ఉండే జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఇటీవలికాలంలో వందలాది మంది చనిపోయారు. మధ్య ఆసియా సరిహద్దుల్లో వనరులతో సుసంపన్నమైన జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లిం విఘర్ తెగ ప్రజలకు, స్థానిక హన్ చైనీస్ జాతి ప్రజలకు నిత్యం ఘర్షణలు చెలరేగుతుండటంతో.. ఇక్కడ కల్లోలిత వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో అశాంతికి ఇస్లామిస్ట్ మిలిటెంట్లే కారణమని చైనా ఆరోపిస్తుండగా.. విఘర్ ముస్లిం ప్రజలను, వారి సంస్కృతిని కమ్యూనిస్టు ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుండటం వల్ల ఇక్కడ తీవ్రస్థాయిలో హింస, ప్రతిఘటన పెల్లుబుక్కుతున్నదని హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు. అయితే, జింగ్‌జియాంగ్‌లో ఎలాంటి అణచివేతకు పాల్పడటం లేదని చైనా చెప్తున్నది.