బీజింగ్: ఉగర్ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మించిన డ్రాగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా మిత్రదేశం, ఇస్లాం పరిరక్షక దేశంగా చెప్పుకొనే పాకిస్తాన్ మాత్రం ఇంతవరకు ఈ విషయంపై ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. కాగా వాయువ్య చైనాలో గల జిన్‌జియాంగ్ (జిన్‌జియాంగ్ ఉగర్ అటానమస్ రీజియన్(ఎక్స్‌యూఏఆర్)ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన విషయం తెలిసిందే.(భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం)
ఇందులో భాగంగా ఉగ్రవాదాన్ని సాకుగా చూపి.. ఉగర్లను డిటెన్షన్ క్యాంపుల్లో బంధిస్తూ, వారి మత విశ్వాసాలపై ఆంక్షలు విధించిందంటూ చైనాను వీడి విదేశాల్లో నివసిస్తున్న పలువురు ఉగర్ ముస్లింలు గోడు వెళ్లబోసుకున్న తీరును కళ్లకు కట్టాయి. 1966- 76 చైనా సాంస్కృతిక విప్లవంలో భాగంగా జిన్‌జియాంగ్‌లోని మసీదులతో పాటు ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాలను ధ్వంసం చేసిన తీరు, తాజాగా షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఉగర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును మరోసారి వెలుగులోకి తీసుకువచ్చాయి.
ఈ నేపథ్యంలో రేడియో ఫ్రీ ఏషియా ఉగర్లతో జరిపి టెలిఫోన్ సంభాషణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2016లో మసీదులను చక్కదిద్దే పేరిట(రెక్టిఫికేషన్ క్యాంపెయిన్) క్యాంపెయిన్ చేపట్టిన డ్రాగన్ సర్కారు.ముస్లింల ప్రార్థనా స్థలాలు, ఇతర పవిత్ర స్థలాలను కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిన్‌జియాంగ్‌లో గల హొటాన్‌లో ఉన్న మసీదు స్థలాన్ని ఆక్టివిటీ సెంటర్ పేరిట వినోదాత్మక, విహార స్థలంగా మార్చేందుకు స్థానిక అధికారులు సమాయత్తమవుతున్నారు. అదే సిటీలో మరో చోట మసీదు స్థానంలో సిచువాన్ కేంద్రంగా పనిచేసే కంపెనీకి అనుబంధంగా అండర్‌వేర్‌ల ఉత్పత్తి కంపెనీని ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!)
అదే విధంగా ఆజ్నా మసీదును కూలగొట్టి ఆ ప్రదేశంలో సిగరెట్లు, మద్యం అమ్మే షాపును నెలకొల్పారు. మరికొన్ని చోట్ల పార్కులు, పార్కింగ్ స్థలాలుగా మార్చారు. ఈ క్యాంపెయిన్ పేరిట జిన్‌జియాంగ్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 70 శాతం మేర మసీదులను చైనా అధికార పార్టీ ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఉగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్టు ఓ నివేదికను విడుదల చేసింది. ‘విశ్వాసాల పతనం’ పేరిట ప్రచురించిన ఆ రిపోర్టులో 2016-19 మధ్య 10 వేల నుంచి 15 వేల ప్రార్థనా మందిరాలను చైనీస్ ప్రభుత్వం కూల్చివేసినట్లు తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే ఉగర్లతో పాటు ఇతర మతస్థుల ఉనికికి కూడా ప్రమాదం వాటిల్లే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment