Xinjiang
-
భారత సంతతి జర్నలిస్ట్‌కు పులిట్జర్ పురస్కారం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్ మేఘ రాజగోపాలన్ ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. మరో ఇద్దరితో కలిసి శుక్రవారం ఆమె ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. చైనా జిన్జియాంగ్ ప్రాంతంలో రహస్యంగా వందలాది జైళ్లు, నిర్బంధ శిబిరాలు నిర్మించి.. వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకుని.. చిత్ర హింసలకు గురి చేస్తోన్న విషయాలను వెల్లడించినందుకు మేఘ రాజగోపాలన్ ఈ బహుమతి గెలుచుకున్నారు. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఇద్దరు భారత సంతతి జర్నలిస్టులలో అమెరికా బజ్‌ఫీడ్ న్యూస్‌కు చెందిన ఎంఎస్ రాజగోపాలన్ ఒకరు. ఈమె ప్రచురించిన జిన్జియాంగ్ సిరీస్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. 2017 లో, జిన్జియాంగ్లో చైనా వేలాది మంది ముస్లింలను అదుపులోకి తీసుకోవడం ప్రారంభించిన కొద్దికాలానికే, రాజగోపాలన్ ఒక నిర్బంధ శిబిరాన్ని సందర్శించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తమ దేశంలో అటువంటి ప్రదేశాలు లేవని చైనా ఖండించిన సమయంలో, బజ్‌ఫీడ్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. "మేఘ రాజగోపాలన్ జిన్జియాంగ్ ప్రాంతంలో సందర్శించిందని గుర్తించిన వెంటనే చైనా ప్రభుత్వం ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించింది, ఆమె వీసాను సస్పెండ్ చేయడమే కాక దేశం నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది" అని బజ్‌ఫీడ్ న్యూస్ బహుమతి కోసం పంపిన తన ఎంట్రీలో వెల్లడించింది. డ్రాగన్ బెదిరింపులకు భయపడని మేఘన మరో ఇద్దరి సాయంతో లండన్ నుంచి పనిచేయడం ప్రారంభించారు. వీరిలో ఒకరు అలిసన్ కిల్లింగ్, లైసెన్స్ పొందిన ఆర్కిటెక్చర్, భవనాల ఉపగ్రహ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణలో నైపుణ్యం కలిగినవాడు కాగా మరొకరు క్రిస్టో బుస్చెక్ డాటా జర్నలిస్టుల కోసం టూల్స్ రూపొందించే ప్రోగ్రామర్. ఈ ముగ్గురి బృందం చైనా సెన్సార్ చేసిన వేలాది ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడ జరుగుతున్న అరాచకాలను ప్రపంచానికి వెల్లడించారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మేఘన పులిట్జర్ గెలవడంపై స్పందిస్తూ.. ‘‘ఈ అవార్డు గెలుచుకుంటానని తాను అస్సలు ఊహిచలేదని.. పూర్తిగా షాక్‌లో ఉన్నాను’’ అన్నారు మేఘన. చదవండి: అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా చైనా క్యాంపుల్లో మహిళలపై అత్యాచారం -
తారస్థాయికి విభేదాలు: అమెరికాకు చైనా వార్నింగ్!
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అయితే అదే సమయంలో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం సహించబోమని పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వ భావనతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం- డ్రాగన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపించాయి. కానీ, ఇటీవల అలస్కాలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టోనీ బ్లింకెన్, వాంగ్ యీ మధ్య జరిగిన మొట్టమొదటి భేటీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిన్జియాంగ్, హాంకాంగ్, తైవాన్ విషయంలో చైనా అవలంబిస్తున్న విధానాలు, ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా సైతం.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామంటూ దీటుగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో వాంగ్ యీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొంటూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, తమ మాటే శాసనం అనే వైఖరిని చైనా ఎన్నటికీ అంగీకరించబోదు. ముఖ్యంగా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం. అంతేకాదు, తప్పుడు సమాచారం, అసత్యాల ఆధారంగా చట్టవ్యతిరేకంగా, ఏకపక్షంగా ఆంక్షలు అమలు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని అమెరికాను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు కథనం వెలువరించింది. కాగా అలస్కా సమావేశంలో భాగంగా, జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరుతోందన్న ఆరోపణలతో, చైనా అధికారులు, వస్తువులపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరిన నేపథ్యంలో వాంగ్ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం. చదవండి: భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్! బద్ధశత్రువులతో వేదికను పంచుకోనున్న భారత్ -
చైనాను కార్నర్ చేసిన యూఎస్, యూకే, జర్మనీ!
న్యూయార్క్: ఉగర్ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా, యూకే, జర్మనీ తీవ్రంగా విమర్శించాయి. ఉగ్రవాద నిర్మూలన పేరిట మైనార్టీ వర్గాల హక్కులను డ్రాగన్ కాలరాస్తోందని మండిపడ్డాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా ఆయా దేశాల ప్రతినిధులు చైనా తీరును ఎండగట్టాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో అమెరికా శాశ్వత ప్రతినిధి కెల్లీ క్రాఫ్ట్ మాట్లాడుతూ.. ‘‘జింగ్జియాంగ్లో నివసిస్తున్న పది లక్షలకు పైగా ఉగర్లు, ఇతర ముస్లింలను ఉగ్రవాద నిరోధక చర్యల పేరిట అక్రమంగా బంధించడం పట్ల ఆందోళనగా ఉంది. తీవ్ర వాదాన్ని అణిచివేసే పేరిట భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడం సరైంది కాదు. మత స్వేచ్చను హరించి మైనార్టీ వర్గాలను అణగదొక్కేందుకే ఇలా వ్యవహరిస్తున్నారు’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి: చైనాలో మసీదులు కూల్చివేత.. పాక్ మౌనం) ఇక యూకే ప్రతినిధి జేమ్స్ రాస్కో సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉగర్లు, ఇతర భిన్న మైనార్టీ జాతుల పట్ల అణచివేత వైఖరి ప్రదర్శిస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం సరికాదని డ్రాగన్‌కు హితవు పలికారు. ఉగ్రవాదాన్ని రూపుమాపే పేరిట మైనార్టీలను నిర్బంధించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జర్మనీ రాయబారి విమర్శించారు. కాగా హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు చైనా తీసుకువచ్చిన విధానాలపై కూడా పలు దేశాలు ఇప్పటికే యూఎన్ఎస్సీ రహస్య సమావేశంలో చర్చను లేవనెత్తాయి. అయితే డ్రాగన్ మాత్రం తమ అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం అనవసరమని తేల్చిచెప్పింది.(చదవండి: విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) కాగా వాయువ్య చైనాలో గల జిన్జియాంగ్ (జిన్జియాంగ్ ఉగర్ అటానమస్ రీజియన్(ఎక్స్‌యూఏఆర్)ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన విషయం తెలిసిందే. -
చైనాలో మసీదుల కూల్చివేత.. మౌనం వీడని పాక్!
బీజింగ్: ఉగర్ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మించిన డ్రాగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా మిత్రదేశం, ఇస్లాం పరిరక్షక దేశంగా చెప్పుకొనే పాకిస్తాన్ మాత్రం ఇంతవరకు ఈ విషయంపై ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. కాగా వాయువ్య చైనాలో గల జిన్జియాంగ్ (జిన్జియాంగ్ ఉగర్ అటానమస్ రీజియన్(ఎక్స్‌యూఏఆర్)ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన విషయం తెలిసిందే.(భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం) ఇందులో భాగంగా ఉగ్రవాదాన్ని సాకుగా చూపి.. ఉగర్లను డిటెన్షన్ క్యాంపుల్లో బంధిస్తూ, వారి మత విశ్వాసాలపై ఆంక్షలు విధించిందంటూ చైనాను వీడి విదేశాల్లో నివసిస్తున్న పలువురు ఉగర్ ముస్లింలు గోడు వెళ్లబోసుకున్న తీరును కళ్లకు కట్టాయి. 1966- 76 చైనా సాంస్కృతిక విప్లవంలో భాగంగా జిన్జియాంగ్లోని మసీదులతో పాటు ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాలను ధ్వంసం చేసిన తీరు, తాజాగా షీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఉగర్ల పట్ల వ్యవహరిస్తున్న తీరును మరోసారి వెలుగులోకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో రేడియో ఫ్రీ ఏషియా ఉగర్లతో జరిపి టెలిఫోన్ సంభాషణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2016లో మసీదులను చక్కదిద్దే పేరిట(రెక్టిఫికేషన్ క్యాంపెయిన్) క్యాంపెయిన్ చేపట్టిన డ్రాగన్ సర్కారు.ముస్లింల ప్రార్థనా స్థలాలు, ఇతర పవిత్ర స్థలాలను కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిన్జియాంగ్లో గల హొటాన్లో ఉన్న మసీదు స్థలాన్ని ఆక్టివిటీ సెంటర్ పేరిట వినోదాత్మక, విహార స్థలంగా మార్చేందుకు స్థానిక అధికారులు సమాయత్తమవుతున్నారు. అదే సిటీలో మరో చోట మసీదు స్థానంలో సిచువాన్ కేంద్రంగా పనిచేసే కంపెనీకి అనుబంధంగా అండర్వేర్ల ఉత్పత్తి కంపెనీని ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. (విదేశాల్లో ఉన్న వాళ్లపై కూడా చైనా నిఘా!) అదే విధంగా ఆజ్నా మసీదును కూలగొట్టి ఆ ప్రదేశంలో సిగరెట్లు, మద్యం అమ్మే షాపును నెలకొల్పారు. మరికొన్ని చోట్ల పార్కులు, పార్కింగ్ స్థలాలుగా మార్చారు. ఈ క్యాంపెయిన్ పేరిట జిన్జియాంగ్ వ్యాప్తంగా ఉన్న దాదాపు 70 శాతం మేర మసీదులను చైనా అధికార పార్టీ ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఉగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్టు ఓ నివేదికను విడుదల చేసింది. ‘విశ్వాసాల పతనం’ పేరిట ప్రచురించిన ఆ రిపోర్టులో 2016-19 మధ్య 10 వేల నుంచి 15 వేల ప్రార్థనా మందిరాలను చైనీస్ ప్రభుత్వం కూల్చివేసినట్లు తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే ఉగర్లతో పాటు ఇతర మతస్థుల ఉనికికి కూడా ప్రమాదం వాటిల్లే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించింది. -
చైనా క్యాంపుల్లో మహిళలపై అత్యాచారం
న్యూఢిల్లీ: మైనారిటీలను చైనా ప్రభుత్వం హింసిస్తోందని అమెరికా సామాజికవేత్త రుషాన్ అబ్బాస్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2018లో సెప్టెంబర్ 28న తన సోదరి, మెడికల్ డాక్టర్ గుల్షాన అబ్బాస్‌ను చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని, ఇప్పటివరకు తన గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే దీనికి గల కారణం కూడా తెలీదని, కనీసం తనపై ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. తన స్నేహితురాళ్లను సైతం కాన్సంట్రేషన్ క్యాంపులో నిర్బంధించిందని ఆరోపించారు. చైనాలో అడుగంటిపోతున్న మానవ హక్కుల కోసం తాను గళమెత్తి ప్రశ్నించినందుకు ప్రతీకారంగా డ్రాగన్ దేశం ఈ అరాచకానికి పూనుకుందన్నారు. తన మతానికి చెందిన వారిపై చైనా దుర్మార్గానికి పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. (వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం ) అక్కడి మహిళలను శారీరకంగా, మానసికంగా హింసిస్తారు "1949లో మా భూమిని ఆక్రమించినప్పటినుంచి కమ్యూనిస్ట్ చైనా వివిధ సాకులను చూపుతూ ఉఘర్ ముస్లింలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడి అధికారులు వారిని శారీరకంగానూ, మానసికంగానూ చిత్రహింసలు పెడుతారు. సరైన తిండీ, నీళ్లు ఇవ్వరు. సరిగా నిద్ర కూడా పోనివ్వరు. ఈ శిబిరాల నుంచి బయటకు వచ్చే చాలా మంది మహిళలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు (స్టెరిలైజేషన్) చేస్తారు. ఇప్పటికీ అక్కడి రహస్య క్యాంపుల్లో 3 మిలియన్ల మంది ఉఘర్ మహిళలు మగ్గిపోతున్నారు. ఆ దేశ ఎకానమీ కోసం వీరిని కట్టుబానిసలుగా వినియోగించుకుంటున్నారు" అని రుషాన్ పేర్కొన్నారు. బుకాయిస్తోన్న చైనా ప్రభుత్వం కాగా చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఉఘర్ ముస్లిములను నిర్బంధించి వారిపై అత్యాచారానికి పాల్పడుతూ బలవంతంగా పెళ్లి చేసుకుని జనాభాను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఏళ్ల తరబడి వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్నో దారుణాలకు అడ్డాగా మారిన కాన్సంట్రేషన్ క్యాంపును చైనా తొలిసారిగా 2014లో నిర్మించింది. ఆరేళ్లలో ఇవి విస్తరిస్తూ 500 శాతం పెరిగాయి. సాటిలైట్ చిత్రాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వీటిని 'ఎడ్యుకేషన్ క్యాంపులు'గా బుకాయిస్తోంది. (ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత) -
సద్దాం, జిహాద్.. పేర్లు పెడితే అంతే సంగతులు
-
సద్దాం, జిహాద్.. పేర్లు పెడితే అంతే సంగతులు
చైనాలో ఇస్లామిక్ పేర్లపై ఉక్కుపాదం! బీజింగ్(చైనా): ముస్లిం జనాభా ప్రాబల్యముండే జిన్జియాంగ్ ప్రావిన్సులో చైనా సర్కారు తాజాగా సరికొత్త ఆంక్షలు విధించింది. సద్దాం, జిహాద్ వంటి డజన్లకొద్ది ఇస్లామిక్ పేర్లను నిషేధించింది. ఈ పేర్లు పెట్టుకోవడం వల్ల ’మత అభిమానం’ పెరిగిపోవచ్చునంటూ కమ్యూనిస్టు చైనా ఈ చర్య తీసుకుంది. జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉయ్గుర్ తెగకు చెందిన ముస్లిం ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ తమను చైనా అణచివేస్తున్నదంటూ ఈ తెగవారు కొన్నాళ్లుగా హింసాత్మక ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తెగ ప్రజలు తమ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టకూడదో వివరిస్తూ తాజాగా చైనా ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధించిన ఈ పేర్లు పెడితే విద్యతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు వారికి వర్తించబోవని, స్కూళ్లలో ప్రవేశం లభించదని అక్కడి ప్రముఖ మానవ హక్కుల సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ వాచ్(హెచ్ఆర్డబ్ల్యూ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సాధారణంగా పిల్లలకు ఇలాంటి పేర్లే పెట్టుకుంటారని, ఇలాంటి పేర్లపై నిషేధం విధించటం తగదని అది పేర్కొంది. ఇలాంటి పేర్లు మత అభిమానాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయనటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనాలో ఇస్లాం, ఖురాన్, మక్కా, జిహాద్, ఇమాం, సద్దాం, హాజీ, మదీనా వంటి పేర్లను పెట్టుకోరాదంటూ అధికార కమ్యూనిస్టు పార్టీ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇలాంటి పేర్లతో ఉన్న వారి పేరిట ఎలాంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉండవు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఇతర పౌర సేవలు వారికి లభించవు. -
చైనా ప్రభుత్వ భవనంపై 'మిలిటెంట్' దాడి..!
మొత్తం ఐదుగురి మృతి బీజింగ్: చైనాలోని కల్లోలిత జింగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ఓ ప్రభుత్వ భవనంపై ముగ్గురు సాయుధ మిలిటెంట్లు వాహనంతో దాడి చేసి.. పేలుడు పదార్థాలతో విస్ఫోటనానికి పాల్పడ్డారు. అంతేకాకుండా కత్తులతో దాడిచేసి ఇద్దరిని చంపారు. దీంతో ముగ్గురు సాయుధులను పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దక్షిణ జింగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని కారకక్స్ కౌంటీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ భవనాలు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ దాడి ఇస్లామిస్టు మిలిటెంట్ల పనేనని చైనా సర్కారు ఆరోపిస్తున్నది. విఘర్ ముస్లిం తెగ ప్రజలు అధికంగా ఉండే జింగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ఇటీవలికాలంలో వందలాది మంది చనిపోయారు. మధ్య ఆసియా సరిహద్దుల్లో వనరులతో సుసంపన్నమైన జింగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లిం విఘర్ తెగ ప్రజలకు, స్థానిక హన్ చైనీస్ జాతి ప్రజలకు నిత్యం ఘర్షణలు చెలరేగుతుండటంతో.. ఇక్కడ కల్లోలిత వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో అశాంతికి ఇస్లామిస్ట్ మిలిటెంట్లే కారణమని చైనా ఆరోపిస్తుండగా.. విఘర్ ముస్లిం ప్రజలను, వారి సంస్కృతిని కమ్యూనిస్టు ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుండటం వల్ల ఇక్కడ తీవ్రస్థాయిలో హింస, ప్రతిఘటన పెల్లుబుక్కుతున్నదని హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు. అయితే, జింగ్జియాంగ్లో ఎలాంటి అణచివేతకు పాల్పడటం లేదని చైనా చెప్తున్నది. -
చైనాలో భూకంపం: కూలిన ఇళ్లు
బీజింగ్: చైనా వాయువ్య ప్రాంతంలోని జింగ్జియాంగ్ ప్రాంతంలో భూకంపం సంభవించిందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదు అయిందని తెలిపింది.. భూకంప తాకిడికి 50 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి... దాంతో దాదాపు 1500 మంది నిరాశ్రయులైయ్యారని పేర్కొంది. వారిని సురక్షిత ప్రాంతాలకు ఉన్నతాధికారులు తరలించారని తెలిపింది. భూకంప ప్రాంతంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని... భూకంపం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగినట్లు సమాచారం అందలేదని వెల్లడించింది.