చెట్టినాడ్ గ్రూప్ కంపెనీలపై ఐటీ దాడులు
చెన్నై: పారిశ్రామిక దిగ్గజం చెట్టినాడ్ గ్రూప్ కంపెనీల్లో ఆదాయ పన్ను (ఐటీ) విభాగం బుధవారం సోదాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాలతో పాటు తమిళనాడు, ముంబైలో మొత్తం 37 ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు ఐటీ విభాగం వర్గాలు తెలిపాయి. దత్తపుత్రుడు ఎంఏ ఎంఆర్ ముత్తయ్యతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ చెట్టినాడ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ఎంఏఎం రామస్వామి స్పష్టం చేసిన నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముత్తయ్యతో విభేదాల నేపథ్యంలో ఆయనతో సంధి కుదుర్చుకోలేదంటూ రామస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రూ. 10,000 కోట్ల చెట్టినాడ్ గ్రూప్‌నకు సిమెంటు, విద్య, తదితర రంగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి.
ముత్తయ్యతో వివాదం..
వారసుడి కోసం 1996లో ముత్తయ్యను రామస్వామి దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం చెట్టినాడ్ గ్రూప్‌లో ముత్తయ్య, ఆయన భార్య గీతకు మెజారిటీ వాటాలు ఉండగా, రామస్వామికి 24 శాతం వాటాలు ఉన్నాయి. అయితే, కొన్నాళ్లుగా గ్రూప్ నిర్వహణ విషయంలో ఇద్దరికి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి గతేడాది తారస్థాయికి చేరుకున్నాయి. గత ఆగస్టులో జరిగిన చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీకి చైర్మన్‌గా రామస్వామిని కొనసాగించడానికి వాటాదార్లు అంగీకరించలేదు. ఇలాంటి పరిణామం తలెత్తవచ్చని ముందే ఊహించిన రామస్వామి.. సదరు సమావేశంలో తీసుకునే నిర్ణయాలను పరిగణించకుండా ఉండేలా చెన్నై లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఎం మణునీతి చోళన్‌కు రూ. 10 లక్షలు లంచం ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసుపై సీబీఐ దృష్టి సారించింది. ఈ పరిణామాలతో చైర్మన్‌గా ఎల్ ముత్తుకృష్ణన్ నియమితులు కాగా, గౌరవ చైర్మన్ హోదాకు మాత్రమే రామస్వామి పరిమితమయ్యారు. తనకు వ్యతిరేకంగా ముత్తయ్యే ఈ వ్యవహారాన్నంతా నడిపించారని, ఇటీవల చెట్టినాడ్ హౌస్‌లో కొన్ని పత్రాల చోరీలో కూడా ఆయన హస్తం ఉందని రామస్వామి ఆరోపిస్తున్నారు. ముత్తయ్య తనకు ద్రోహం చేశారని, ఆయనతో ఎట్టి పరిస్థితుల్లో సంధి కుదుర్చుకునే ప్రసక్తే లేదని రామస్వామి స్పష్టం చేశారు. తన తదనంతరం ఆస్తి అంతా కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్టులకు వెడుతుందే తప్ప ముత్తయ్యకు చెందదని పేర్కొన్నారు. అలాగే, తన అంతిమ సంస్కారాలను కూడా ముత్తయ్య చేయకూడదంటూ వీలునామా రాసినట్లు వివరించారు.