ఈ ఏడాది లాభాల్లోకి ‘సాక్షి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత రెండేళ్లుగా ‘సాక్షి’ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు త్వరలో తొలగిపోనున్నాయని జగతి పబ్లికేషన్స్ చైర్‌పర్సన్ వై.ఎస్.భారతి రెడ్డి చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ‘సాక్షి’ లాభాల్లోకి వస్తుందని, వచ్చే ఏడాది ఇన్వెస్టర్లకు ఆ లాభాల్లో వాటాను అందించే స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. శనివారం ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఏడవ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గతేడాది ప్రభుత్వ ప్రకటనలపై ఆంక్షలు విధించడం వల్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. ఇప్పుడు ఆ పరిస్థితులు సద్దు మణిగాయి. అన్నీ సజావుగా సాగుతున్నాయి’’ అని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివిధ కేసులు పెట్టినప్పటికీ 1.43 కోట్ల రీడర్‌షిప్‌తో... జాతీయ, ప్రాంతీయ దినపత్రికల్లో ఏడో స్థానంతో సాక్షి ముందుకెళుతోందని భారతిరెడ్డి చెప్పారు. సాక్షిని మరింత మంది పాఠకులకు చేరువ చేయడానికి మొబైల్ అప్లికేషన్స్, సాక్షి పోస్ట్‌తో వెబ్‌పోర్టల్‌ను మరింత ఆధునీకరించినట్లు ఆమె తెలియజేశారు.
సమావేశంలో పాల్గొన్న జగతి పబ్లికేషన్స్ ఫైనాన్స్ డెరైక్టర్ వై.ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని నెలలు లాభాలు వచ్చినా ఉద్యమ ప్రభావం వలన ప్రకటనల ఆదాయం తగ్గిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి తిరిగి లాభాల్లోకి రాగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014-15 సంవత్సరం జగతి పబ్లికేషన్స్ పూర్తిస్థాయిలో లాభాల్లోకి వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. జగతి పబ్లికేషన్స్ కంపెనీ సెక్రటరీ సి.పి.ఎన్.కార్తీక్ ప్రవేశపెట్టిన 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్‌ను ఆమోదించటంతో పాటు హెచ్.వి.ఈశ్వరయ్య, ఎ.ఎన్.ప్రకాష్ రాజులను డెరైక్టర్లుగా తిరిగి నియమిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా వాటాదారులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.