
అభిమానుల కోసం బొమ్మలా..
లాస్ ఏంజిల్స్: సెలబ్రెటీలు తమ అభిమానులను అలరించడానికి అనేక ఫీట్లు చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రముఖ అమెరికన్ పాప్ గాయిని, మైఖేల్ జాక్సన్ చెల్లెలు జానెట్ జాక్సన్ మాత్రం వినూత్నంగా ఆలోచించి అభిమానుల కోసం బొమ్మలా మారిపోయారు. వివరాల్లోకి వెళ్తే..జానెట్ జాక్సన్ తన 'మై మ్యూజిక్ వీఐపీ మ్యూజియం'ను చూడడానికి వచ్చిన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. నల్లని రంగు కాస్ట్యూమ్స్ ధరించిన జాక్సన్ కళ్లు మూసుకొని మ్యూజియంలో బొమ్మలా నిల్చుంది. మ్యూజియంలోని విశేషాలను ఆసక్తిగా తిలకిస్తున్న అభిమానులు జానెట్ను చూసి నిజంగానే బొమ్మ అని భ్రమపడ్డారు.
కాసేపటి తరువాత బొమ్మ కదులుతుండడం గమనించి.. అది తమ అభిమాన సింగర్ జానెట్ జాక్సన్ అని గుర్తించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తరువాత అభిమానులతో కాసేపు సరదాగా గడిపిన జానెట్ తన రాబోయే ఆల్బమ్ 'అన్బ్రేకబుల్'కు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఈ ఊహించని పరిణామంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.