జన్మభూమిలో 12.50 లక్షల రేషన్‌కార్డులు
నూతన సంవత్సర సందేశంలో ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: జనవరి రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో 12.50 లక్షల మందికి రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఐదు వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. శుక్రవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జన్మభూమి-మా ఊరులో స్మార్ట్ వార్డ్, విలేజ్ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకోవటంతో పాటు వాటిని దత్తత తీసుకున్న ప్రముఖులను గ్రామ సభల్లో పరిచయం చేస్తామన్నారు. కేంద్రం సహాకారంతో రాష్ర్ట విభజన నాటి హామీలను ఒక్కొక్కటి అమలు జరిగేలా చూస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.