తోట నుంచి కోటలోకి..!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 231 రోజుల పాటు అధికారానికి దూరంగా ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోయస్ గార్డెన్స్ (తోట) నుంచి... మళ్లీ తమిళనాడు అసెంబ్లీ (కోట)లోకి అడుగు పెట్టేందుకు ఆమె ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16వ తేదీన మరోసారి ఆమె ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయ అనుంగు అనుచరుడు పన్నీర్ సెల్వం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పు వెలువడగానే ఆయన జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్స్కు వెళ్లారు.
గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించడంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తన పదవిని కోల్పోయారు. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడిన ఎవరైనా తమ పదవులను కోల్పోతారు. అందుకే ఆమె తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. అయితే.. కర్ణాటక హైకోర్టు మాత్రం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయడంతో.. ఇప్పుడు మళ్లీ ఆమె ఎమ్మెల్యే అయ్యేందుకు, ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది.