పసిడికి ‘అక్షయ’ కాంతులు...
పుత్తడి అమ్మకాలపై భారీ అంచనాలు
30 శాతం వృద్ధి ఆశిస్తున్న జువెల్లర్స్
మార్చిలో పెరిగిన పసిడి దిగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
అక్షయ తృతీయకు బంగారం మెరుపులు ఉంటాయా? అవుననే చెబుతున్నారు ఆభరణాల వర్తకులు. అక్షయ సెంటిమెంటుకుతోడు పుత్తడి ధర తక్కువగా ఉండడం ఇందుకు కారణమని అంటున్నారు. ఈసారి భారీ అంచనాల నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మార్చిలో 125 టన్నుల పుత్తడి భారత్‌కు దిగుమతి అయింది. ఫిబ్రవరితో పోలిస్తే ఈ పరిమాణం రెండింతలకుపైమాటే. దీన్నిబట్టి చూస్తే అక్షయ మెరుపులు భారీ స్థాయిలో ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్రత్యేకమైన రోజుకోసం కస్టమర్లను రెడీ చేసేందుకు ఆభరణాలపై అడ్వాన్స్ బుకింగ్‌లను జువెల్లరీ కంపెనీలు ఇప్పటికే ప్రారంభించాయి. అలాగే పోటీపడి మరీ డిస్కౌంట్లను ఇస్తున్నాయి. జోరుమీదున్న ఈ-కామర్స్‌నూ వేదికగా చేసుకుని విభిన్న డిజైన్లను కస్టమర్ల ముందుంచుతున్నాయి. ఏప్రిల్ 21న అక్షయ తృతీయ.
ధర పెరిగే అవకాశం..: ఈ ఏడాది జనవరి నుంచి పుత్తడి ధర పతనమవుతూ వస్తోంది. నెల రోజుల క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 26 వేలకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 27 వేల వద్ద కదలాడుతోంది. అక్షయ తృతీయ నాటికి 1-2 శాతం ధర పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) దక్షిణ ప్రాంత చైర్మన్ జి.వి. శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ప్రస్తుత ధర అనుకూలంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా అమ్మకాలపై స్వల్ప ప్రభావం చూపినప్పటికీ, మొత్తంగా 2015-16లో ఆభరణాల విపణి ఉత్తమంగా ఉంటుందని చెప్పారు.
ఆన్‌లైన్‌లో చిన్న చిన్న ఆభరణాలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో డిజైనర్, తేలికైన ఆభరణాలకే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. బంగారు నాణేలు విక్రయించకూడదని వ్యాపారులు గతేడాది స్వచ్ఛందంగా నిర్ణయించి అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆభరణాలతోపాటు నాణేలనూ సిద్ధం చేస్తున్నారు. ఈ అక్షయకు పుత్తడి అమ్మకాల్లో 20-30% వృద్ధి ఆశిస్తున్నామని హైటెక్ సిటీ జువెల్లరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ కుమార్ తయాల్ తెలిపారు.
ఊహించని స్థాయిలో దిగుమతులు
ఈ ఏడాది మార్చి నెలలో ఊహించని స్థాయిలో బంగారం భారత్‌కు దిగుమతి అయింది. ఫిబ్రవరిలో 55 టన్నులు దిగుమతి అయితే మార్చిలో ఏకంగా 125 టన్నులకు ఎగసినట్టు సమాచారం. 2014 మార్చిలో 60 టన్నుల పసిడి దిగుమతైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో దిగుమతి చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.12,280 కోట్లుంది. మార్చిలో ఇది రూ.30,880 కోట్లకు ఎగసింది. 2013-14తో పోలిస్తే 2014-15లో 36 శాతం వృద్ధితో 900 టన్నుల బంగారం దిగుమతైంది. గతేడాది అక్షయ తృతీయ సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 30 వేలకు చేరువలో ఉంది.