
భారత 'మలాలా'ను చంపేశారు
చదువుల తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువతి కలల్ని చిదిమేశారు. తీవ్రవాద ఉద్యమాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి బాగా చదువుకోవాలని ఆరాటపడింది. కానీ మావోయిస్టుల తుపాకీ గుళ్లకు బలైపోయింది.
జార్ఖండ్: చదువుల తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువతి కలల్ని చిదిమేశారు. తీవ్రవాద ఉద్యమాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి బాగా చదువుకోవాలని ఆరాటపడింది. హింసను వదిలిబడిబాట పట్టిన 20 ఏళ్ల యువతి చివరికి తుపాకీ గుళ్లకు బలైపోయింది. ఉగ్రవాదులను ఎదిరించి చదువుల రాణిగా ఎదిగి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నోబెల్ బహుమతి గ్రహీత మలాలా కథను మరిపిస్తుంది.. సంగీత కుమారి అలియాస్ గుడ్డి కథ.
జార్ఖండ్లోని గుమ్లాకు చెందిన సంగీత కుమారి బాల్యదశలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. ఇంటి పక్కనే ఉండే మావోయిస్టు నేత సవిత ద్వారా ఆమె పార్టీలో చేరింది. వంట చేయడంతో మొదలుపెట్టి, తర్వాత షార్ప్ షూటర్గా ఎదిగింది. మావోయిస్టుగా ఆమె చాలాకష్టాలను అనుభవించింది. ఒకసారి లాతేహార్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామనేలోపు అదడు ఎన్కౌంటర్లో చనిపోయాడు. దాంతో బయటకు వచ్చి చదువుకుని మంచి జీవితాన్ని కొనసాగించాలని ఆశపడింది. దానికోసం నాలుగు రోజులు అవిశ్రాంతంగా నడిచింది. చివరికి గత ఏప్రిల్ నెలలో గుల్మాకు చేరుకుని అక్కడ రహస్యంగా తలదాచుకుంది. చంపేస్తామన్న బెదిరింపులను లెక్కచేయకుండా స్కూల్లో చేరింది.
కాగా గత మంగళవారం తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఆమె స్వగ్రామం సిబిల్ చేరింది. కానీ అప్పటికే మావోయిస్టు నేతలు ఆమె కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. సంగీతనూ చంపేస్తామని బెదిరిస్తూ లేఖ వదిలిపోయారు. గురువారం ఉదయానికి ఆమె కూడా శవమై తేలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు.
గతంలో సంగీత మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. దళాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దోపిడీ, బలవంతపు అబార్షన్లు చాలా సర్వసాధారణమని తెలిపింది. అందుకే తనకు నచ్చలేదని.. మళ్లీ హింసాత్మక ఉద్యమాల వైపు వెళ్లనని చెప్పింది. అదే సందర్భంగా తమ బాస్లు తనను బతకనివ్వరనే భయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరికి ఆమె భయమే నిజమైంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఆమెను కాల్చి చంపినట్టు సమాచారం. అలా బలికాకుండా ఉండి ఉంటే బహుశా భారతదేశ మలాలా అయి ఉండేదేమో!