అంబానీ ప్రకటన: దూసుకెళ్తున్న రిలయన్స్ షేర్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బుధవారం ట్రేడింగ్ లో దూసుకుపోతున్నాయి. 8 ఏళ్ల గరిష్టంలో ట్రేడవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి వినియోగదారులకు అందిస్తున్న ఉచిత ఆఫర్లకు జియో ఇక స్వస్తి పలికి, టారిఫ్ ప్లాన్స్ అమలుచేయనున్నట్టు ప్రకటించడంతో షేర్లు జోరందుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ లో ఇండస్ట్రిస్ షేర్లు 7 శాతం జంప్ చేసి, బీఎస్ఈలో రూ.1,166గా నమోదవుతున్నాయి. మిగతా టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియాలు ఫ్లాట్ గా నెగిటివ్ దిశగా ట్రేడవుతున్నాయి.
2017 ఏప్రిల్ 1 నుంచి జియో 4జీబీ సర్వీసులపై ఛార్జీలు వసూలు చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులకు ఊతమిచ్చింది. మల్టి-బిలియన్ టెలికాం వెంచర్ నుంచి నగదు ప్రవాహం కోసం ఇన్వెస్టర్లు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఛార్జీల మోతతో జియో తన సబ్ స్క్రైబర్ బేస్ను ఎలా పడిపోకుండా చూపగలదో చూడాల్సి ఉందని క్రెడిట్ స్యూజ్ చెప్పింది..ఉచిత ఆఫర్లతో ఇన్నిరోజులు వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుని, టెలికాం దిగ్గజాల రెవెన్యూలకు భారీగా గండికొట్టిన సంగతి తెలిసిందే.