జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత చాలామంది బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కొత్త సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2.75 మిలియన్ల యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ తీసుకున్నట్లు సమాచారం.
బీఎస్ఎన్ఎల్ వైపు వచ్చిన యూజర్లలో ఎక్కువ భాగం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చార్జీలు, వ్యాలిడిటీ వంటివి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ముకేశ్ అంబానీ జియోపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రభుత్వం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోందని, స్వదేశీ 4జీ నెట్‌వర్క్ కూడా సిద్ధంగా ఉందని.. దానిని 5Gకి మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ కంపెనీలు 4జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ ఎందుకు దీనిని ప్రవేశపెట్టలేదని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం నిర్వహించే కంపెనీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసి వస్తే.. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని.. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే పరికరాలను ఉపయోగించకూడదని ప్రధానమంత్రి తీర్మానమని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
భారత్ తన స్వంత 4జీ స్టాక్, కోర్ సిస్టమ్ లేదా రేడియేషన్ యాక్సెస్ నెట్‌వర్క్ అని పిలువబడే టవర్‌లను అభివృద్ధి చేస్తుందని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశం తన సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది, దేశప్రజలకు 4G నెట్‌వర్క్‌ను అందిస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతికతను కలిగి ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించిందని సింధియా చెప్పారు.
టవర్ల ఏర్పాటుకోసం తేజస్ నెట్‌వర్క్, సీ-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2025 నాటికి 4G నెట్‌వర్క్‌కు చెందిన లక్ష టవర్లు ఇన్‌స్టాల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment