ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్‌కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్‌ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.
రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్‌స్టార్‌గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
జియోహాట్‌స్టార్ పేరుతో
ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్‌స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్‌స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్‌కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్‌స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్
ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన డెవలపర్‌ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను.
కోటి ఇవ్వాలంటూ
అందుకే జియోహాట్‌స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్‌స్టార్.కామ్ డొమైన్‌ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్‌స్టార్‌గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.
మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment