నోట్ల రద్దు గురించి ముందే నాకు తెలియదు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత తొలిసారి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఏటీఎం క్యూలో నిలబడి కనిపించారు. రాజస్థాన్‌లోని తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన ఇలా క్యూలో నిలబడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు విషయమై ప్రధాని నరేంద్రమోదీ ప్రణాళికలు కొద్దిమందికి మాత్రమే తెలుసునని, ఆర్థికశాఖ సహాయమంత్రి అయిన తనకు కూడా ఈ విషయం గురించి ముందుగా తెలియదని స్పష్టంచేశారు. నల్లధనాన్ని నిరోధించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం అప్పుడే పనిచేయడం ప్రారంభించిందని ఆయన అన్నారు.
ఈ నెల 8న ప్రధాని మోదీ ఆకస్మికంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇది వ్యవస్థీకృత, చట్టబద్ధ దోపిడీ అని మండిపడ్డారు. అయితే, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను మేఘ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆయన ఆర్థికవేత్త కావొచ్చు. కానీ తన హయాంలో అత్యంత భారీస్థాయిలో ప్రజాసొమ్ము దోపిడీకి గురికాకుండా ఆయన అడ్డుకున్నారా? 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణాలు మన్మోహన్ హయాంలోనే జరిగాయి’ అంటూ విమర్శించారు. కాంగ్రెస్‌కు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసునని ఆరోపించారు.