16 దాటితే.. ఇక పెద్దోళ్లే!
బాల నేరస్థులకు సంబంధించిన చట్టాన్ని లోక్సభ ఆమోదించింది. 16-18 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు దారుణమైన నేరాలకు పాల్పడినా కూడా వాళ్లను బాల నేరస్థులుగానే చూడాల్సి రావడం, దానివల్ల వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడం లాంటి ఘటనల నేపథ్యంలో కేంద్రం బాల నేరస్థుల చట్టం సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది. ఇక దీన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి. అలా అయితే ఇక మీదట చట్టాన్ని సవరించి, 16 ఏళ్లు దాటినవాళ్లంతా పెద్దవాళ్లేనని భావిస్తారు. ఇందులో సాధారణ నేరాలు, తీవ్రమైన నేరాలు, హేయమైన నేరాలు అనే మూడు విభాగాలుగా నేరాలను వర్గీకరించారు. ప్రతి విభాగానికి వేర్వేరుగా విధానాలను అందులో నిర్వచించారు.
నిర్భయ ఘటనలో అందరికంటే ఘోరంగా ప్రవర్తించినది ఒక మైనర్ కావడంతో అప్పటి నుంచి బాల నేరస్థుల వయసు మీద చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2000 నాటి బాల నేరస్థుల చట్టానికి దాదాపు 40 సవరణలు రాగా, అన్నింటినీ లోక్సభ ఆమోదించింది. 2013 సంవత్సరంలో మొత్తం 28 వేల కేసుల్లో బాల నేరస్థులు ఉండగా, వాటిలో 3887 అత్యంత హేయమైనవని జాతీయ నేర రికార్డుల బ్యూరో కూడా వెల్లడించిందని ఈ బిల్లు మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.