అహంకార రాజకీయంపై జనాగ్రహం | k ramachandra murthy analysis on delhi assembly election results | Sakshi
Sakshi News home page

అహంకార రాజకీయంపై జనాగ్రహం

Published Wed, Feb 11 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

అహంకార రాజకీయంపై జనాగ్రహం

అహంకార రాజకీయంపై జనాగ్రహం

-కె రామచంద్రమూర్తి
ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఎన్నికల ప్రణాళికను విస్మరించి, ప్రజలను పట్టించుకోకుండా, తామే సర్వజ్ఞులమనీ, సర్వాధికారులమనీ, భాగ్యవిధాతలమనీ విర్రవీగే రాజకీయ నాయకుల వీపు విమానం మోత మోగడం తథ్యమని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్),
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోదీ అనుభవాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే వారికే మంచిది. అధికారం తలకెక్కించుకున్న నాయకులకు అవకాశం వచ్చినప్పుడు అన్ని చోట్లా ఓటర్లు ఇదే గుణపాఠం చెబుతారు. తస్మాత్ జాగ్రత.

భారతీయ జనతా పార్టీ(భాజపా) నాయకులు పత్రికా ప్రకటనలో చెప్పినట్టు నిజంగానే అరవింద్ కేజ్రీవాల్‌ది ఉపద్రవ గోత్రమే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భాజపా, కాంగ్రెస్‌ల పాలిట ఉపద్రవంగానే పరిణమించాయి. రెండేళ్ల కిందట పుట్టిన పార్టీ ధాటికి తట్టుకోలేక రెండు జాతీయ పార్టీలూ గింగిరాలు తిరిగాయి. స్వతంత్ర భారత పార్లమెంటరీ చరిత్రలో కనీవినీ ఎరుగని సునామీని మనం కళ్లారా చూశాం. 70 స్థానాలలో 67 స్థానాలు గెలుచుకోవడం ఢిల్లీలోనే కాదు భారత దేశంలోనే ఒక చరిత్ర. ఇది అపరచాణక్యులలాగా అభినయించే ‘సర్వే’శ్వరులకు సైతం ఊహకందని అపూర్వ పరిణామం.

తొమ్మిది మాసాల కిందట ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ గెలుచుకొని, అరవై అసెంబ్లీ విభాగాలలో మెజారిటీ సాధించిన భాజపా అసెంబ్లీ ఎన్నికలలో పరమచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పే సాహసం ఏ సంస్థా చేయలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుస్తుందని చెప్పాయి కానీ ఇంత ఘనవిజయం సాధిస్తుందని చెప్పలేకపోయాయి. కాంగ్రెస్ ముక్త్ భారత్ (కాంగ్రెస్ లేని భారత దేశం) నినాదంతో జైత్రయాత్ర ప్రారంభించిన నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయగలిగాడు కానీ భాజపా ముక్త్ ఢిల్లీ (భాజపా లేని ఢిల్లీ) ఆవిష్కారాన్ని ఆపలేకపోయాడు.

ఆందోళన చేయడం, ఎన్నికలలో వినూత్నంగా, సృజనాత్మకంగా ప్రచారం చేయడం, విజయం సాధించడం ఒక ఎత్తు. సుపరిపాలన అందించడం ఒక ఎత్తు. ఢిల్లీ తర్వాత ఆప్ విస్తరించే అవకాశం పంజాబ్‌లో దండిగా ఉంది. లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో నాలుగు స్థానాలను (మూడొంతుల స్థానాలను) ఆప్ గెలుచుకుంది. అధికార అకాలీదళ్ పట్లా, ప్రతిపక్ష కాంగ్రెస్ పట్లా ప్రజలకు సదభిప్రాయం లేదు. ఆప్‌కు ప్రజాదరణ అభించే అవకాశం ఉంది. అయితే, ఆప్ విజయావకాశాలు మంగళవారం సాధించిన విజయంపై ఆధారపడి ఉండవు. రేపటి నుంచి ఆప్ ప్రభుత్వం పరిపాలించే తీరు ఆ పార్టీ విస్తరణావకాశాలను నిర్ణయిస్తుంది. మార్కెట్ ఎకానమీ, ప్రపంచ బ్యాంకు అభివృద్ధి  నమూనాలనే లోగడ కాంగ్రెస్ కానీ ఇప్పుడు భాజపా కానీ అనుసరిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ఆవిష్కరించే అవకాశం ఆప్‌కు ఉన్నది. ఆప్‌కు అగ్ని పరీక్ష అధికారంలోకి రాగానే ఆరంభం అవుతుంది.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ కొన్ని వారాల పాటు సాగుతుంది. నరేంద్రమోదీ, అమిత్‌షాలు చేసిన తప్పిదాలపైన తర్జనభర్జనలు తప్పవు. లోక్‌సభ ఎన్నికలలో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నది కనుకనే ఆమ్ ఆద్మీ పార్టీ తేరుకొని బలం పుంజుకొని అసాధారణ విజయం సాధించింది. భాజపా నాయకత్వం కూడా ఢిల్లీ అనుభవం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. ఈ ఎన్నికల నుంచి అన్ని రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులూ నేర్చుకోవలసిన పాఠాలు అనేకం. వీటిలో ఒకటి మాత్రం అందరికీ వర్తిస్తుంది. ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఎన్నికల ప్రణాళికను విస్మరించి, ప్రజలను పట్టించుకోకుండా, తామే సర్వజ్ఞులమనీ, సర్వాధికారులమనీ, భాగ్యవిధాతలమనీ విర్రవీగే రాజకీయ నాయకుల వీపు విమానం మోత మోగడం తథ్యమని ఈ ఎన్నికలు నిరూపించాయి.

ఢిల్లీ ప్రజలు ఆప్‌కి పాజిటివ్‌గా (సకారాత్మకంగా) ఓటు చేసి ఉండవచ్చును కానీ మోదీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని కూడా భావించాలి. మోదీ-షా ద్వయం అహంకారపూరితంగా వ్యవహరించడం ఢిల్లీలో జీవితపర్యంతం జనసంఘ్‌కూ, భాజపాకూ వీరవిధేయులుగా ఉన్నవారికి సైతం ఆగ్రహం కలిగించింది. పోలింగ్ మూడు వారాలు ఉన్నదనగా కిరణ్‌బేడీని పార్టీలోకి స్వాగతించి ప్రచారసారథ్యం అప్పగించడంతో ఆగకుండా, ఆప్‌లో ఉండగా మోదీనీ, భాజపానూ నిర్దాక్షిణ్యంగా దుయ్యబట్టిన షాజియా ఇల్మీని పార్టీలో చేర్చుకోవడాన్ని పాతతరం భాజపా నాయకులు ఏ మాత్రం హర్షించలేకపోయారు. రామ్‌జాదోం, హరామ్‌జాదోం అంటూ ఒక మంత్రి అనడాన్ని ఆక్షేపించకపోవడమే కాకుండా పార్లమెంటులో ఆమెను సమర్థించినందుకు వారు మోదీని క్షమించలేదు.

ఢిల్లీలో సంఘ్‌పరివారం ప్రాబల్యం మొదటి నుంచీ ఉన్నప్పటికీ చర్చిలపై దాడులు ఎన్నడూ జరగలేదు. ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు జరిగాయంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక కారణాలు భాజపా దారుణ ఓటమికీ, ఆప్ చారిత్రక విజయానికీ దారి తీశాయి. కాంగ్రెస్ కుప్పకూలిపోవడం, కాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం ఓటు చేస్తూ వచ్చిన దళితులూ, మైనారిటీలూ మూకుమ్మడిగా ఆప్‌కు తరలిపోవడం కూడా భాజపా పరాజయానికి దారితీసిన కారణాలలో ఒకటి.

ఆమ్ ఆద్మీని (సామాన్య పౌరుడిని) విస్మరించడం ఎంతటి బలమైన రాజకీయ పక్షానికైనా ఆత్మహత్యాసదృశమని ఢిల్లీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి. ఎనిమిది మాసాలకు పైగా ఢిల్లీ రాష్ట్రం కేంద్ర పాలనలోనే ఉంది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ భాజపా ప్రాబల్యంలోనే ఉంది. కానీ పేద, దిగువ మధ్యతరగతికి జరిగిన మేలంటూ ఏమీ లేదు. ఈ తరగతి ప్రజలు మాత్రమే కాకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఆప్‌కు ఓటు వేయడానికి కారణం మోదీకి అహంకారం పెరిగిందనీ, సొంతపార్టీలో ఉన్న మతవాదులను నియంత్రించడంలో విఫలమైనాడనీ వారు భావించడమే.

ఎన్నికలలో విజయాలు సాధించి ప్రభుత్వాలు నడుపుతున్న రాజకీయ పార్టీలకూ, వాటి సారథులకూ ఢిల్లీ ఎన్నికలు చేసే ఈ హెచ్చరిక  అత్యంత విలువైనది. దీన్ని పెడచెవిన పెడితే పదవికి ప్రమాదం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోదీ అనుభవాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే వారికే మంచిది.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (తెదేపా)లపై విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీపైన తెదేపా అభ్యర్థులుగా ఎన్నికలలో పోటీ చేసిన ఏడుగురికి పార్టీ తీర్థం ఇచ్చి మంత్రిపదవులతో సత్కరించడాన్ని పుష్కరంపాటు తెలంగాణ రాష్ట్ర సమితిని (టీఆర్‌ఎస్) అంటిపెట్టుకున్న నాయకులు ఎట్లా హర్షిస్తారు? ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలు అమలు చేయకుండా ప్రణాళికలో రేఖామాత్రంగా కూడా సూచించని పనులు చేస్తున్న చంద్రబాబునాయుడిని ప్రజలు ఎట్లా ఉపేక్షిస్తారు? రైతుల రుణ మాఫీ హామీని సక్రమంగా చేయకుండా, వారి పొలాలను వారి ఆమోదం లేకుండా స్వాధీనం చేసుకోవడాన్ని ఎట్లా సహిస్తారు?

అధికారం ఉన్నది కదా అని మోదీ భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయించడాన్ని దేశంలో రైతులు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోక ఏం చేస్తారంటూ అధికారంలో ఉన్నవారు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం తాజాగా ఢిల్లీ ఓటర్లు చెప్పారు. అధికారం తలకెక్కించుకున్న నాయకులకు అవకాశం వచ్చినప్పుడు అన్ని చోట్లా ఓటర్లు ఇదే గుణపాఠం చెబుతారు. తస్మాత్ జాగ్రత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement