రమ్యకు నోబెల్ పురస్కారం ఇవ్వాలి: స్టార్ హీరో
స్టార్ హీరో, హీరోయిన్ల మధ్య దేశభక్తి అంశం తీవ్ర వివాదానికి కారణమైంది. ఒకప్పుడు సినీరంగాన్ని ఏలిన వాళ్లిద్దరూ ఇప్పుడు రాజకీయనాయకులుగా.. అది కూడా భిన్నపార్టీల్లో కొనసాగుతున్నారు. వాళ్లు.. కన్నడ నటి రమ్య, నటుడు జగ్గేశ్ లు. 'పాకిస్థాన్ నరకమేమీకాదు' అని రమ్య ఇచ్చిన స్టేట్మెంట్తో మొదలైన వివాదం.. కర్ణాటకను దాటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నటి రమ్యకు బెదిరింపులు కూడా వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
హీరోయిన్గా మంచి డిమాండ్ ఉన్నప్పుడే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఎంపీగా గెలిచిన రమ్య అలియాస్ దివ్య స్పందన.. సార్క్ యువ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఇటీవలే పాకిస్థాన్(ఇస్లామాబాద్) వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడి పరిస్థితులను వివరిస్తూ 'పాకిస్థానీలు నన్ను బాగా చూసుకున్నారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. దక్షిణ ఆసియాలో నెలకొన్న అనేక సమస్యలపై మేం చర్చించాం. కొద్ది మంది అన్నట్లు పాకిస్థాన్ నరకమేమీకాదు' అని ట్వీట్ చేశారు. అంతే, కన్నడనాట బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
'పెద్దగా చదువు, జ్ఞానం లేని రమ్యలాంటి వాళ్లకు పాకిస్థాన్ గురించి, దాని దుష్టనీతిని గురించి ఏమాత్రం అవగాహనలేదు. ఎంతసేపూ శతృత్వాన్ని ప్రదర్శించే పాక్ ను మనం కూడా శత్రువుగానే భావించాలి. ఆమె(రమ్య) తనను తాను శాంతిదూతనని అనుకుంటుందేమో! ఆమెకు వెంటనే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. క్లింటన్ తో ఫొటో తీయించుకునే అవకాశం కల్పించాలి' అంటూ కన్నడ స్టార్ హీరో, బీజేపీ నేత అయిన జగ్గేశ్.. రమ్యపై విరుచుకుపడ్డారు. పాకిస్థాన్పై రమ్య వ్యాఖ్యలను నిరసిస్తూ బెంగళూరు, మరికొన్ని చోట్ల బీజేపీ, ఏబీవీపీలు ఆమె పోస్టర్ను చెప్పులతో కొట్టారు.
తానేం తక్కువ తిన్నానా అంటూ రమ్య కూడా ఈ వివాదాన్ని ఇంకాస్త పొడిగించారు. 'పాకిస్థానీలు మన సోదరులు. ఎప్పటికైనా అఖండభారత్ మళ్లీ అవతరిస్తుంది' అన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ట్వీట్ కు జోడిస్తూ పాక్ పై తన మాటలను సమర్థించుకున్నారు. దీంతో ఈ వివాదం జాతీయస్థాయికి చేరింది. ఇటు సంఘ్ శక్తులు, అటు కాంగ్రెస్ వాదులు పోటాపోటీగా రమ్యను విమర్శించే, సమర్థించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు తనను బెదిరింపులకు గురిచేసినట్లు రమ్య పేర్కొన్నారు. 'పాక్ కు వెళ్లడమంటే నరకానికి వెళ్లడమే' అంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.