
రాజధానిని ముట్టడించిన రైతులు
కన్నడ రైతన్నకు కోపం వచ్చింది. ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే భారీ సంఖ్యలో వచ్చి రాజధాని బెంగళూరు నగరాన్ని ముట్టడించారు. రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బెంగళూరు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఉత్తర కర్ణాటక రైతులు కూడా తక్షణం కరువు సహాయ చర్యలు చేపట్టాలన్నారు.
ఉత్తర కర్ణాటకలోని 12 జిల్లాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. చెరకు రైతులకు ఫ్యాక్టరీలు బాకీ పడిన వెయ్యి కోట్ల రూపాయలను తక్షణం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు రాజధానిని ముట్టడించారు. రైతులు ట్రాక్టర్లతో అసెంబ్లీ దిశగా వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు.. బెంగళూరు నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిబంధన విధించడంతో దానికి నిరసనగా వందలాది ట్రాక్టర్లతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గాన్ని కూడా రైతులు దిగ్బంధించారు.