అంబరీష్ వైద్య ఖర్చుల చెల్లింపుపై వివాదం
బెంగళూరు: శ్యాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ వైద్యానికి కోటి 16 లక్షల రూపాయలు చెల్లించాలని రాష్ట్రప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై వివాదం చెలరేగింది. 62 ఏళ్ల అంబరీష్ సింగపూర్లోని ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబం సింగపూర్ ప్రయాణానికి, చికిత్సకు అయిన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
నటి సుమలత భర్త అయిన అంబరీష్ శ్వాస కోశానికి ఇన్‌ఫెక్షన్ కారణంగా తొలుత ఇక్కడి విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో సింగపూర్‌కు తరలించారు. అక్కడ ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో చేర్చారు. అక్కడ చికిత్స తీసుకొని, అనంతరం మలేషియాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అంబరీష్ ఏప్రిల్లో నగరానికి తిరిగి వచ్చారు.
వైద్య చికిత్సకు అయిన మొత్తాన్ని చెల్లించమని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ మొత్తం చెల్లించడానికి ప్రభుత్వం తీర్మానించింది. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అంత మొత్తాన్ని ప్రభుత్వం ఏ విధంగా చెల్లిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విధమైన చెల్లింపులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంగా వారు వాదిస్తున్నారు.
శాసనసభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే, చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉంది. అయితే అంబరీష్కు వైద్యం చేయించడాన్ని ప్రభుత్వం ప్రత్యేక కేసుగా భావించిందని, అందువల్ల వైద్య ఖర్చులు మొత్తం చెల్లించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తెలిపారు. నటుడుగా అంబరీష్ కర్ణాకటకకు గొప్ప ఆస్తి అని, అటువంటి వ్యక్తికి చికిత్స నిమిత్తం ప్రభుత్వమే సింగపూర్కు పంపించే ఏర్పాట్లు చేసినట్లు మంత్రి శివకుమార్ చెప్పారు.
ఇదేమీ కొత్త నిర్ణయం కాదని, గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయని బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ చెప్పారు.