అత్యాచార ఆరోపణలు: ఏఎస్ఐ అరెస్టు
మానసిక వికలాంగురాలైన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కర్ణాటకలోని తుముకూరులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను అరెస్టు చేశారు. ఉమేష్ (54) అనే ఈ అధికారిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి, సస్పెండ్ చేసినట్లు తుముకూరు ఎస్ఐ ఇషా పంత్ తెలిపారు. ఈ నేరానికి పురిగొల్పినందుకు జీపు డ్రైవర్ ఈశ్వరప్ప (32)ను కూడా అరెస్టు చేశామన్నారు. నిందితులిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని, విచారణ పూర్తి కాగానే చార్జిషీటు దాఖలు చేస్తామని పంత్ చెప్పారు.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తుండగా.. ఒక హోంగార్డుతో కలిసి బైకు మీద పెట్రోలింగ్ కోసం వెళ్తున్న ఏఎస్ఐ ఉమేష్ చూశారు. ఆమెను ఇంటికి దింపుతామని చెప్పి, గార్డును పోలీసు స్టేషన్‌కు పంపేశారు. ఆమెను ఇంటికి చేర్చడానికి సాయం చేయాలని జీపు డ్రైవర్ ఈశ్వరప్పను కోరారు. దారిలో ఆమెపై ఉమేష్ అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలికి పెళ్లయినా, మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన తల్లి ఇంట్లోనే ఉంటోందని వివరించారు.