చెప్పేదొకటి.. చేస్తున్నదొకటి!
కేంద్ర విధానాలను ఎండగట్టిన ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ విధానాలు గందరగోళంగా ఉన్నాయని, రెండేళ్లు పూర్తయినా, మూడు బడ్జెట్లు వచ్చినా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేదని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత దుయ్యబట్టారు. గురువారం లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆమె కేంద్రంపై పదునైన విమర్శలు చేశారు. ‘గందరగోళమైన విధానం మీది. మీరు చెప్పేదొకటి. చేస్తున్నదొకటి. వెనుకబడిన ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణకు మరిన్ని నిధులు ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సడలించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడేమో కమిటీ అంటున్నారు’ అంటూ దుయ్యబట్టారు. ‘స్టార్టప్ ఇండియా మంత్రాన్ని వల్లె వేస్తున్న మీరు ఇంటర్‌నెట్‌లో వాణిజ్య ప్రకటనలపై పన్ను విధించారు. ఇంటర్‌నెట్‌లో ప్రకటనలు ఇచ్చేది కొత్తగా నెలకొన్న స్టార్టప్‌లే. అంటే మీరు చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు కాలేదు’ అని విమర్శించారు.
ఎలా రెట్టింపు చేస్తారు?: ‘ఫసల్ బీమా యోజనలో రైతును యూనిట్‌గా తీసుకోవాలి. ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు? ఎలా చేస్తారు? దీనికి ప్రణాళిక ఏదీ?’ అని ప్రశ్నించారు.