తెలంగాణ ఏర్పాటులో సోనియా సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల దుఃఖాన్ని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయం చేశారని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ‘‘మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీరు (స్పీకర్ సుమిత్రా మహాజన్) ఇటీవల చట్టసభల మహిళా ప్రతినిధులతో రెండు రోజులపాటు సదస్సు ఏర్పాటు చేశారు. ఒక మహిళగా నిర్ణయం తీసుకోగలిగిన స్పీకర్ పదవిలో ఉన్నందునే ఇది సాధ్యమైంది. శక్తివంతమైన స్థానాల్లో మహిళలు ఉంటే అందరికీ సాయపడొచ్చు. న్యాయం కూడా జరుగుతుంది.
మేడమ్ సోనియా గాంధీ అలా శక్తివంతమైన స్థానంలో కూర్చున్నప్పుడు మా ప్రజలకు సాయం చేయగలిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె సాయం చేశారు. ఆమె మా దుఃఖాన్ని అర్థం చేసుకున్నారని, అందుకే సాయం చేశారని మాకు అనిపిస్తుంది..’’ అని కవిత వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహం చేపట్టినప్పుడు ఏర్పాటు చేసిన 70 మంది బృందంలో మహిళలు లేరని...
సత్యాగ్రహంలో తమను ఎందుకు చేర్చుకోవడం లేదంటూ సరోజినీ నాయుడు సహా వందలాది మహిళలు నిరసన తెలిపారన్నారు. దాని తర్వాతే వేలాది మంది మహిళలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. దేశానికి తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం ఐదు శాతం మందే మహిళా ఎంపీలు ఎన్నికయ్యారని, ప్రస్తుతం అది నెమ్మదిగా 12 శాతానికి పెరిగిందని కవిత పేర్కొన్నారు. అయితే మహిళలను రాజకీయ ఉద్యమాల్లో వెనక్కి నెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉన్నత స్థాయి కుటుంబాల మహిళలకూ కష్టాలు!
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనూ మహిళలు కష్టాలు ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. తాను చాలా మంది మహిళలతో మాట్లాడానని...పెళ్లిళ్ల అనంతరం తాము ఒక పంజరం నుంచి వచ్చి మరో పంజరంలో పడ్డట్టుగా అనిపిస్తోందని వారు చెప్పారన్నారు. ‘‘ఆడపిల్లపై తొలుత అమ్మా, నాన్న, సోదరుడు అధికారం చెలాయిస్తారు.
పెళ్లి అనంతరం అత్త-మామ, భర్త అధికారం నడుస్తుంది. మహిళల జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఉన్నత స్థాయి కుటుంబాల్లోనూ ఇలాగే ఉంటోంది. తేడా ఏమిటంటే అద్దాల మేడ నుంచి అది కనిపించదుగానీ వారిదీ అదే పరిస్థితి..’’ అని కవిత పేర్కొన్నారు. మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉందని... ఆడపిల్లలను తప్పనిసరిగా చదివిస్తే దేశంలో మార్పు వస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు.