telangana peoples
-
వారిని స్వదేశానికి తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ గురువారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోందని, ఇందులో భాగంగా అనేక మంది తెలంగాణవాసులను స్వదేశానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణవాసులు పని చేస్తున్నారని, వారిలో బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా స్వదేశానికి రాలేక గల్ఫ్‌లోనే చిక్కుకుపోయి దీనావస్థలో ఉన్నారని తెలిపారు. దీంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా తక్షణమే మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. లేఖలను ఈమెయిల్ ద్వారా కేంద్ర మంత్రులకు పంపించారు. -
కువైట్‌లో రాష్ట్రవాసుల కష్టాలు తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కువైట్‌లో తెలంగాణవాసులు 50వేల మందికి పైగా ఇబ్బందులు పడుతున్నారని, ఆ దేశ అంబాసిడర్ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్ చెప్పారు. సొంత దేశానికి వచ్చేందుకు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని భారత్‌కు రప్పించాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కువైట్‌కు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించాలని, ప్రభుత్వ ఖర్చులతోనే బాధితులను రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. కువైట్ నుంచి వచ్చినవారికి ప్రభుత్వం ఉపాధి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసుల గురించి తమ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. మంత్రుల గల్ఫ్ పర్యటనలన్నీ జల్సాలకు, బతుకమ్మ సంబరాలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నారై పాలసీ రూపొందించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో గల్ఫ్ బాధితుల సంక్షేమ చట్టాన్ని రూపొందించాలని, రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. గల్ఫ్ బాధితులకు సాయం అందించేందుకు టీపీసీసీ నుంచి ఓ బృందం గల్ఫ్ వెళ్లనుందని, వారి బాధితుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. -
హైదరాబాద్ టు ఆంధ్రా
సాక్షి, హైదరాబాద్: కోడి పందేలకు నగరవాసులు సైతం సై అంటున్నారు! ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే కోడి పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే సంక్రాంతికి దాదాపు 20 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లగా.. ప్రత్యేకంగా కోడి పందేల్లో పాల్గొనేందుకు మరో 10 వేల మంది వరకు వెళ్లారు. ఆదివారం అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్, పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి వీరంతా సొంత వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు పయనమయ్యారు. కోడి పందేలు, పొట్టేళ్ల పందేలతోపాటు పలుచోట్ల జరిగే గుండాటల్లో పాల్గొనేందుకు వీరు ఉత్సుకత చూపుతున్నారు. తెలంగాణవాసులను ఆహ్వానిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కటౌట్లు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. లష్కర్ టు భీమవరం కోడి పందేళ్లలో పాల్గొనేందుకు పలువురు లష్కర్వాసులు భీమవరం వెళ్లారు. శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వీరు శనివారం ఉదయం భీమవరం చేరుకున్నారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి వెయ్యి మంది సుమారు 200 వాహనాల్లో వెళ్లారు. గత పదిహేనేళ్లుగా ఏటా భీమవరం వెళ్లడం, కోడి పందేళ్లలో పాల్గొని రావడం వీరికి మామూలే. భీమవరం ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, ప్రత్యేక భవనాలు ముందే అద్దెకు తీసుకుని, మూడ్రోజులకు సరిపడా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి పెట్టుకుంటారు. కొందరైతే ఇక్కడి నుంచే వంటవాళ్లను, పనివాళ్లను తీసుకువెళ్తున్నారు. భీమవరం బాట పడుతున్నవారిలో భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగులు, పెద్దమొత్తంలో ఇంటి అద్దెల ఆదాయం కలిగిన వారు, పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ్నుంచి 90 పొట్టేళ్లు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లులో జరిగే పొట్టేళ్ల పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌వాసులు మక్కువ చూపుతున్నారు. ఇక్కడ్నుంచి దాదాపు 60 నుంచి 90 వరకు పొట్టేళ్లను తీసుకెళ్లారు. ‘‘ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా పొట్టేళ్ల పందెంలో పాల్గొనేందుకు వెళ్తున్నాం. మా పొట్టేళ్లు ఈసారి గతంలో కంటే మెరుగ్గా పోటీపడతాయి’’అని పాతబస్తీకి చెందిన మంజూర్ పేర్కొన్నారు. ఏపీలో కత్తులు దూసిన పందెం కోళ్లు ఏపీలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ.150 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ.3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగినట్టు అంచనా వేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోడి పందేలను ప్రారంభించారు. పాతబస్తీలో రూ.15 కోట్ల వ్యాపారం ఏపీలో జరిగే కోళ్ల పందేల కోసం నగరంలో దాదాపు రూ.15 కోట్లకుపైగా కోళ్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. పాతబస్తీలోని బార్కస్, ఎర్రకుంట, షాహీన్ నగర్లో 50 మంది పందెం కోళ్ల పెంపకందారులు ఉన్నారు. ఒక్కొక్కరు కనీసం 50 నుంచి 60 కోళ్లను పెంచి, విక్రయించినట్లు తెలిసింది. ఒక్కో కోడి ధర రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా పలికినట్టు సమాచారం. వీటిని కొనుగోలు చేసేందుకు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొద్దినెలల కిందటే పందెం రాయుళ్లు వచ్చారు. వీరు దాదాపు 2 వేల నుంచి 3 వేల కోళ్ల దాకా కొనుగోలు చేసినట్టు పాతబస్తీలోని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా కొనుక్కు వెళ్లిన వాటిలో కొన్నింటిని ఇళ్లలోనే పెంచుకుంటూ వచ్చే ఏడాది పందేలకు సిద్ధం చేస్తారు. బలిష్టంగా ఉన్న కోళ్లను ఈ ఏడాదే పందెం బరిలోకి దింపుతారు. నగరానికి ‘పల్లె’శోభ నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. వీధుల్లో భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగుల సయ్యాటలతో భోగిని నగరవాసులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పల్లెలకు వెళ్లలేనివారు నగరంలోనే పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. దీంతో ఆదివారం నగరంలో చాలాచోట్ల పల్లె వాతావరణం కనిపించింది. -
తెలంగాణ ప్రజలపై పగబట్టిన చంద్రబాబు
ధ్వజమెత్తిన ప్రభుత్వ విప్ సునీత సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజలపై పగబట్టారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత విమర్శించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డంకులు సృష్టిస్తూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బాబు తాను తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకమని విషంకక్కినా టీటీడీపీ నేతలు నోరు మెదపలేదన్నారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ వ్యక్తిత్వమయితే, అందరూ నాశనమైనా తాను బాగుండాలనే రాక్షసత్వం బాబుదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొత్త ప్రాజెక్టని బాబు అనడం దారుణమన్నారు. -
2019లో కాంగ్రెస్‌దే అధికారం
యాదగిరిగుట్ట : తెలంగాణ ప్రజల ఏన్నో ఏళ్ల కళను సకారం చేసి ప్రత్యేక రాష్ట్రాని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలే 2019లో అధికారంలోకి తీసుకువస్తారని మాజీ ఎంపీ, శిక్షణ తరగతుల కమిటీ చైర్మన్ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట పట్టణ సమీపంలోని శివసాయి గార్డెన్స్‌లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. తన కుటుంబ రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ రెండే ళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతి నిధులు దాసోజు శ్రావణ్‌కుమార్, అద్దంకి దయూకర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ కచ్చితంగా గుర్తుపెట్టుకుం టుందన్నారు. కాంగ్రెస్‌ను 2019లో అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.ముందుగా దివంగత నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటాపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శిబిరంలో పార్టీసీనియర్ నేతలు పీసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, ప్రేమ్‌లాల్, ఎస్సీసెల్ టీపీసీసీ అధ్యక్షుడు జగన్‌లాల్, జిల్లా ఎస్సీసెల్, బీసీసెల్ నాయకులు వెంకన్న, రవీందర్, రవిబాబు, రవీందర్‌రెడ్డి, దుంపల శ్రీను, చింతపండు నవీన్, బీర్ల అయిలయ్య, నరేందర్‌గుప్త, సుధాకర్, మహేందర్, రవీందర్, మల్లేష్, హరినాథ్, ద్యాస లక్ష్మారెడ్డి, శంకర్‌నాయక్, యాదగిరి, సర్పంచ్ ఇమ్మడి మాధ వి రాంరెడ్డి, సత్యనారాయణ, ఎంపీటీసీ కానుగు కవిత బాలరాజు, గొట్టిపర్తి జయమ్మ బాల రాజు, స్థానిక నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, బాలనర్సయ్య, మిట్ట వెంకటయ్య, శ్రీధర్, బాలలక్ష్మి, నీలం వెంకటస్వామి, ఆకుల పద్మ పాల్గొన్నారు. -
తెలంగాణ ఏర్పాటులో సోనియా సాయం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల దుఃఖాన్ని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సాయం చేశారని టీఆర్ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ‘‘మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మీరు (స్పీకర్ సుమిత్రా మహాజన్) ఇటీవల చట్టసభల మహిళా ప్రతినిధులతో రెండు రోజులపాటు సదస్సు ఏర్పాటు చేశారు. ఒక మహిళగా నిర్ణయం తీసుకోగలిగిన స్పీకర్ పదవిలో ఉన్నందునే ఇది సాధ్యమైంది. శక్తివంతమైన స్థానాల్లో మహిళలు ఉంటే అందరికీ సాయపడొచ్చు. న్యాయం కూడా జరుగుతుంది. మేడమ్ సోనియా గాంధీ అలా శక్తివంతమైన స్థానంలో కూర్చున్నప్పుడు మా ప్రజలకు సాయం చేయగలిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె సాయం చేశారు. ఆమె మా దుఃఖాన్ని అర్థం చేసుకున్నారని, అందుకే సాయం చేశారని మాకు అనిపిస్తుంది..’’ అని కవిత వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహం చేపట్టినప్పుడు ఏర్పాటు చేసిన 70 మంది బృందంలో మహిళలు లేరని... సత్యాగ్రహంలో తమను ఎందుకు చేర్చుకోవడం లేదంటూ సరోజినీ నాయుడు సహా వందలాది మహిళలు నిరసన తెలిపారన్నారు. దాని తర్వాతే వేలాది మంది మహిళలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. దేశానికి తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు కేవలం ఐదు శాతం మందే మహిళా ఎంపీలు ఎన్నికయ్యారని, ప్రస్తుతం అది నెమ్మదిగా 12 శాతానికి పెరిగిందని కవిత పేర్కొన్నారు. అయితే మహిళలను రాజకీయ ఉద్యమాల్లో వెనక్కి నెట్టేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి కుటుంబాల మహిళలకూ కష్టాలు! సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల్లోనూ మహిళలు కష్టాలు ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. తాను చాలా మంది మహిళలతో మాట్లాడానని...పెళ్లిళ్ల అనంతరం తాము ఒక పంజరం నుంచి వచ్చి మరో పంజరంలో పడ్డట్టుగా అనిపిస్తోందని వారు చెప్పారన్నారు. ‘‘ఆడపిల్లపై తొలుత అమ్మా, నాన్న, సోదరుడు అధికారం చెలాయిస్తారు. పెళ్లి అనంతరం అత్త-మామ, భర్త అధికారం నడుస్తుంది. మహిళల జీవితంలో ఎలాంటి మార్పు రాదు. ఉన్నత స్థాయి కుటుంబాల్లోనూ ఇలాగే ఉంటోంది. తేడా ఏమిటంటే అద్దాల మేడ నుంచి అది కనిపించదుగానీ వారిదీ అదే పరిస్థితి..’’ అని కవిత పేర్కొన్నారు. మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉందని... ఆడపిల్లలను తప్పనిసరిగా చదివిస్తే దేశంలో మార్పు వస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పారు. -
రాష్ట్రం మారినా రాత మారలే..
ఇదీ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల పరిస్థితి * వలస వాదులపై కనీస దృష్టి కేంద్రీకరించని ప్రభుత్వం * అ‘సమగ్ర సర్వే’తోనూ దక్కని ప్రయోజనం సాక్షి, ముంబై: దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముంబైలోని అనేక మంది తెలంగాణ ప్రజలు సైతం తమవంతు పాత్ర పోషించారు. కాని ఎవ్వరికీ పైసా ప్రయోజనం ఒరగలేదు. రాష్ట్రం వచ్చిందన్న సంతోషం తప్పిస్తే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. రాష్ట్ర అవతరణ అనంతరం అధికారాన్ని దక్కించుకున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తెలంగాణ భవన్ ఏర్పాటు, వలసవాదుల కోసం పథకాలు, రైలు, బస్సు సేవలువంటి వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కార్మిక సమస్యలు అలానే ఉండిపోయాయి. రేషన్‌కార్డులు, పెన్షన్లు వంటి విషయాల్లో తెలంగాణకు చెందిన ముంబైలోని కూలీలకు దక్కిందంటూ ఏమీలేదు. అసమగ్ర సర్వే.. మరోవైపు సమగ్ర కుటుంబ సర్వే సమయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి ముంబై వాసులను నిరాశపరిచింది. పొట్టచేతపట్టుకుని ముంబైకి వచ్చిన అనేక మంది తెలంగాణ వలసబిడ్డలు ఉన్న ఫలంగా అప్పులు చేసి స్వగ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. తాము తెలంగాణ వారిమేనని పేర్లు నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్లారు. కాని చాలా మంది పేర్లు ఇప్పటికీ నమోదు కాలేదంటే అతిశయోక్తికాదు. నాలుగు నెలలు ఇక్కడ నాలుగు నెలలు అక్కడ ఉండే కూలీలు ప్రధానంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లోనూ మహారాష్ట్రలోని వారు ఓటు వినియోగించుకుని ప్రభుత్వ ఏర్పాటులో భాగమయ్యారు. ప్రత్యేక తెలంగాణ కోసం... ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలోని వారిలానే ముంబైలోని వలస ప్రజలు కూడా తమవంతు కృషి చేశారు. అనేక కార్యక్రమాలతో తెలంగాణవాదులను చైతన్యపరిచారు. గోరేగావ్‌లో 2007 జనవరిలో జరిగిన తెలంగాణ ధూమ్‌ధామ్ కార్యక్రమంతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. 2008లో దాన్ని మరింత ఉధృతం చేశారు. ఇదే ఏడాది తెలంగాణ వాదులు అనేక సంఘాలు ఏర్పాటుచేసుకున్నారు. ముంబై టీఆర్ఎస్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ముంబై తెలంగాణ బహుజన ఫోరం క్రియాశీల పోషించింది. ఉద్యమాన్ని కలసి చేయాలనే ఉద్దేశంతో తెలుగు సంఘాలన్నీ ఏకమై ‘తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక’, ‘ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ’గా ఏర్పాటయ్యాయి. ఆజాద్ మైదానంలో నిరాహారదీక్షలు చేపట్టారు. గోరేగావ్‌లో 2013 నవంబరులో జరిగిన తెలంగాణ సాధన సభ ఓ కొత్త ఊపునిచ్చింది. మా కష్టాలు మాత్రం తీరలేదు ‘తెలంగాణ ఏర్పడి ఏడాది అవుతోందన్న సంతోషం ఉంది. కాని మా కష్టాలు మాత్రం తీరడం లేదు. మేం తూర్పు భాండూప్‌లోని శ్యాంనగర్ మురికివాడలో నివసిస్తున్నాం. మాతోపాటు ఇక్కడ సుమారు 100 పైగా తెలుగువారి ఇళ్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన చాలామంది పొట్టచేతపట్టుకుని ముంబైకి వచ్చినవారే. గత మూడు దశాబ్దాలకుపైగా భాండూప్ శ్యాంనగర్‌లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాం. చాలా సార్లు మా గుడిసెలను కూల్చివేశారు. అన్ని ఆధారాలున్నా మాకు అన్యాయం జరుగుతోంది. ముంబైలోని తెలుగు సంఘాలు, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు మా గోడును వినిపించుకోవాలి. - ముస్తఫా, మహబూబ్‌నగర్ సంతలో సరుకుల లిస్టులా... ‘తెలంగాణ ఏర్పడితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ఇక వలస వెళ్లే వారే ఉండరని, వలసలు వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చి స్వస్థలాల్లో ఉపాధి పొందుతూ బతకొచ్చని ఎంతగానో ఊదరగొట్టారు. తర్వాత అవి జరగాలంటే సమగ్ర సర్వేలో కుటుంబ సభ్యులంతా పాల్గొనాలన్నారు. అందరం అన్ని సర్దుకొని ఊరికి పోయాం. సంతలో కొనుగోలు చేసే సరుకుల లిస్ట్ మాదిరిగా అధికారులు రాసుకున్నారు. అంతకు మినహా ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర లేదు. పూర్వ ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదు. ప్రజల పాట్లు ఎప్పటి లానే ఉన్నాయి.’ - దాసరి లక్ష్మి నారాయణ, కరీంనగర్ -
హైదరాబాద్‌లో రగల్ జెండా
* తొట్టతొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు, సోషలిస్టులకు బ్రహ్మరథం * తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో ఉద్యమ పార్టీలదే హవా * ఔరంగాబాద్, గుల్బర్గా మద్దతుతో పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి: ‘బాంచన్ దొరా..నీ కాల్మొక్తం’ అంటూ రెండున్నర శతాబ్దాల పాటు నిజాం రాజుల పరిపాలనలో స్వేచ్ఛ, సమానత్వానికి పూర్తిగా దూరమైన తెలంగాణ జనం.. తాము ఓటేసిన తొట్ట తొలి ఎన్నికల్లో తమదైన ముద్ర వేశారు. 1947 ఆగస్టు 15 తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు, 1948 అనంతరం భారతదేశంలో విలీమైన సంస్థానాల్లోనూ 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదిన కాంగ్రెస్‌ను ఓటర్లు అందలం ఎక్కించారు. అయితే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణలో ప్రజలు మాత్రం దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా నిజాం నవాబుపై సాయుధ సమరాన్ని నడిపిన రైతు, కూలీ ప్రతినిధులకు అటు లోక్‌సభ, ఇటు రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా పట్టం కట్టారు. 1952లో జరిగిన తొట్టతొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పీఠం దక్కినా... తెలంగాణలో మాత్రం ఉద్యమ పార్టీలకే అప్పటి ఓటర్లు పట్టం కట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజన్, కర్ణాటకలోని గుల్బర్గా డివిజన్‌తో పాటు తెలంగాణ ప్రాంతంలో మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరిపితే.. గుల్బర్గా, ఔరంగాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కవుూ్యనిస్టులు బలపరిచిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) జెండాలు రెపరెపలాడాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోషలిస్టు పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేసి 93 స్థానాలు కైవసం చేసుకోగా, కవుూ్యనిస్టుల సారథ్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 77 స్థానాల్లో పోటీ చేసి 42 స్థానాలను చేజిక్కించుకుంది. మొత్తం స్థానాల్లో 100 శాసనసభ స్థానాలు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే(తెలంగాణ) ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల విజయం సాధిస్తే, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన ఉద్యమకారులతో బరిలోకి దిగిన పీడీఎఫ్ 35 స్థానాల్లో, సమ సమాజం పేరుతో రంగంలోకి దిగిన సోషలిస్ట్ పార్టీ పదకొండు చోట్ల విజయం సాధించాయి. మరో పది చోట్ల స్వతంత్ర, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలు గెలుపొందాయి. అంటే తెలంగాణలో వంద స్థానాల్లో 66 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులే ఎన్నిక కావడం విశేషం. మొట్టమొదటి ఎన్నికల్లో విశేషాలివి... * హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 109 శాసనసభ స్థానాలతో పాటు మరో 33 ద్విసభ స్థానాలున్నాయి. * మొత్తం 564 మంది అభ్యర్థులు పోటీ పడగా, కేవలం 42.32 పోలింగ్ శాతమే నమోదు అయింది. * కాంగ్రెస్ పార్టీ 173 స్థానాలకు పోటీ చేసి 42.32 శాతం ఓట్లతో 93 స్థానాల్లో విజయం సాధించింది. * పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షాజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, షాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విరుపాక్షప్ప 88.49 శాతం ఓట్లు పొంది ఎస్పీ అభ్యర్థి భీంసేన్రావుపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. * అత్యధికంగా హింగోలి స్థానం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. * 77 స్థానాల్లో పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 39.59 శాతం ఓట్లతో 42 స్థానాల్లో విజయం సాధించింది. అందులో 35 స్థానాలు తెలంగాణలోనివే. * 97 స్థానాల్లో పోటీ చేసిన సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలు గెలుచుకోగా ఆ 11 స్థానాలు తెలంగాణలోనివే. * షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే తెలంగాణలో సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్(ద్విసభ స్థానాల్లో ఒక్కొక్కటి) మూడింటా విజయకేతనం ఎగరేసింది. * హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తే, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పీడీఎఫ్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. * హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 54.34 శాతం ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ఎల్.ల క్ష్మారెడ్డిపై గెలుపొందారు. * తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి భువనగిరి శాసనసభ స్థానం నుంచి 55.12 శాతం ఓట్లు సాధించి తన సమీప బంధువు, ప్రథమ భూ దాత, తన బావ వెదిరె రామచంద్రారెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. * ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు వివిధ సమయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వికారాబాద్ స్థానం నుంచి మర్రి చెన్నారెడ్డి, అలంద్ నుంచి వీరేంద్రపాటిల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. * వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి (కాంగ్రెస్) గెలుపొందగా, షాబాద్ నుంచి కొండా వెంకట రంగారెడ్డి 77.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. నెహ్రూను మించిన... రావి మెజారిటీ తొట్టతొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజానీకం హైదరాబాద్ రాష్ట్ర ఫలితాలను ఆసక్తిగా గమనించింది. 25 లోక్‌సభ (4 ద్విసభతో కలిపి) స్థానాలున్న రాష్ట్రంలో 13 స్థానాల్లో కాంగ్రెస్, ఏడు స్థానాల్లో పీడీఎఫ్, రెండు స్థానాల్లో సోషలిస్ట్లు మరో మూడు స్థానాల్లో ఇతరులు గెలి చారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక ఓట్లను పొందారు. ఆ ఎన్నికల్లో ఆలహాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన జవహర్లాల్ నెహ్రూ 2,33,571ఓట్లు పొందగా, రావి నారాయణరెడ్డికి 3,09,162(పీడీఎఫ్) ఓట్లు పోల్ కావడం ఓ రికార్డ్. అలాగే గుల్బర్గా స్థానం నుంచి రామానందతీర్థ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికవ్వగా, హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆహ్మద్ మోహినోద్దిన్ చేతిలో పీడీఎఫ్ అభ్యర్థి ముగ్దూం మోహియుద్దిన్ ఓటమి పాలయ్యారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రజాకవి కాళోజి నారాయణరావు మూడున్నర వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తాం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజల నాలుగున్నర దశాబ్దాల పోరాటా లు, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజే పీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివా రం సాయంత్రం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అదే సమయంలో నరేంద్రమోడీ, బీజేపీలకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. సుసి ్థర, సమర్థవంతమైన, అవినీతిరహిత పాలనకోసం వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలతో పాటు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్తో దోస్తీ ఎందుకు కట్టారు ‘అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. రాష్ట్రం విడిపోతే నష్టాలను వివరించారు. అయితే 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ విషయాలు తెలియవా? అప్పుడు పొత్తును ఎందుకు అడ్డుకోలేదు’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కలిసుంటే లేదు సుఖం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంతో నష్టపోయిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సాగు భూములకు నీళ్లు లేక, కరెంటు సరఫరా కాక ఈ ప్రాంత రైతులు అనేక అవస్థల పాలై గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అక్కడా నష్టాలపాలై పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి శవాలను తేవడానికి కూడా ఈ ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అనేక నష్టాలకు గురిచేసిందన్నారు. తెలంగాణ కోసం వేలాది మందిని జైళ్లపాలు చేసిందని, ఎందరో కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఆందోళన వద్దు.. సవరణల పేరుతో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ పెట్టి, అసెంబ్లీలో ఓడించే కుట్రలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటులో బీజేపీ తెలంగాణ బిల్లును గెలిపిస్తుందని పేర్కొన్నారు. సమర్థతకు, అసమర్థతకు పోరాటం వచ్చే ఎన్నికల్లో సమర్థతకు, అసమర్థతకు పోరాటం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసరాలు, పెట్రోల్, వంటగ్యాస్, ఎరువులు, ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు... ఇలా అన్నింటి ధరలు పెంచి పేద, మధ్యతరగతిపై మోయలేని భారాన్ని మోపిందని ఆరోపించారు. అన్నింటా అవినీతికి పాల్పడుతోందన్నారు. తాగేందుకు నీళ్లివ్వని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఊరూరా పారిస్తోందంటూ విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాయన్నారు. అక్కడ కరెంటు సమస్య లేదన్నారు. పారిశ్రామికవేత్తలు అక్కడికి పరుగులు పెడుతున్నారంటే అక్కడ నీతివంతమైన పాలన, నాణ్యమైన కరెంటు ఇవ్వడమే కారణమన్నారు. అవినీతి నిర్మూలన జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఇప్పుడేమైనా 24 గంటలిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు సమస్య ఉంటుందని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇప్పుడేమైనా కరెంటు 24 గంటలు ఇస్తున్నారా అని బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గుజరాత్‌లాగే కరెంటును మెరుగుపర్చుకుంటామన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని, తమ పార్టీ బిల్లును పాస్ చేయిస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను తీరుస్తుందన్నారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు ధర్మారావ్, లోక భూపతిరెడ్డి, మోతె కృష్ణాగౌడ్, ప్రభాకర్ యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు పెద్దోళ్ల గంగారెడ్డి, విఠల్‌గుప్తా, బాపురెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఆలూర్ గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, పుల్లూరి సతీశ్, సుధాకర్, రంజిత్ మోహన్, హరిస్మరణ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, టక్కర్ హన్మంత్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, లింబాద్రి, లింగారెడ్డి, గీతారెడ్డి, సంగారెడ్డి, శైలజ, వసుధారెడ్డి, తదితరులు పాల్గొనారు. షబ్బీర్ హస్తం తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ హస్తం ఉందని నిట్టు వేణుగోపాల్‌రావు ఆరోపించారు. షబ్బీర్‌అలీ నియోజకవర్గ అభివృద్ధి చేసిందేమీ లేదని, ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల అభివృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. షబ్బీర్‌అలీపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌గౌడ్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. పండుగలు కూడా జరుపుకోకుండా టపాకాయలు అమ్మడాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.