హైదరాబాద్‌లో రగల్ జెండా | Telangana people vote for congress of first lok sabha elections in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రగల్ జెండా

Published Thu, Mar 27 2014 1:29 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

హైదరాబాద్‌లో రగల్ జెండా - Sakshi

హైదరాబాద్‌లో రగల్ జెండా

* తొట్టతొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు, సోషలిస్టులకు బ్రహ్మరథం
* తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో ఉద్యమ పార్టీలదే హవా
* ఔరంగాబాద్, గుల్‌బర్గా మద్దతుతో పీఠం దక్కించుకున్న కాంగ్రెస్

 
 శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి: ‘బాంచన్ దొరా..నీ కాల్మొక్తం’ అంటూ రెండున్నర శతాబ్దాల పాటు నిజాం రాజుల పరిపాలనలో స్వేచ్ఛ, సమానత్వానికి పూర్తిగా దూరమైన తెలంగాణ జనం.. తాము ఓటేసిన తొట్ట తొలి ఎన్నికల్లో తమదైన ముద్ర వేశారు. 1947 ఆగస్టు 15 తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు, 1948 అనంతరం భారతదేశంలో విలీమైన సంస్థానాల్లోనూ 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదిన కాంగ్రెస్‌ను ఓటర్లు అందలం ఎక్కించారు. అయితే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణలో ప్రజలు మాత్రం దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా నిజాం నవాబుపై సాయుధ సమరాన్ని నడిపిన రైతు, కూలీ ప్రతినిధులకు అటు లోక్‌సభ, ఇటు రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా పట్టం కట్టారు.
 
1952లో జరిగిన తొట్టతొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పీఠం దక్కినా... తెలంగాణలో మాత్రం ఉద్యమ పార్టీలకే అప్పటి ఓటర్లు పట్టం కట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజన్, కర్ణాటకలోని గుల్‌బర్గా డివిజన్‌తో పాటు తెలంగాణ ప్రాంతంలో మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరిపితే.. గుల్‌బర్గా, ఔరంగాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కవుూ్యనిస్టులు బలపరిచిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) జెండాలు రెపరెపలాడాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోషలిస్టు పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేసి 93 స్థానాలు కైవసం చేసుకోగా, కవుూ్యనిస్టుల సారథ్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 77 స్థానాల్లో పోటీ చేసి 42 స్థానాలను చేజిక్కించుకుంది. మొత్తం స్థానాల్లో 100 శాసనసభ స్థానాలు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే(తెలంగాణ) ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల విజయం సాధిస్తే, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన ఉద్యమకారులతో బరిలోకి దిగిన పీడీఎఫ్ 35 స్థానాల్లో, సమ సమాజం పేరుతో రంగంలోకి దిగిన సోషలిస్ట్ పార్టీ పదకొండు చోట్ల విజయం సాధించాయి. మరో పది చోట్ల స్వతంత్ర, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలు గెలుపొందాయి. అంటే తెలంగాణలో వంద స్థానాల్లో 66 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులే ఎన్నిక కావడం విశేషం.  
 
 మొట్టమొదటి ఎన్నికల్లో విశేషాలివి...
*  హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 109 శాసనసభ స్థానాలతో పాటు మరో 33 ద్విసభ స్థానాలున్నాయి.
*  మొత్తం 564 మంది అభ్యర్థులు పోటీ పడగా, కేవలం 42.32 పోలింగ్ శాతమే నమోదు అయింది.
*  కాంగ్రెస్ పార్టీ 173 స్థానాలకు పోటీ చేసి 42.32 శాతం ఓట్లతో 93 స్థానాల్లో విజయం సాధించింది.
*  పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షాజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, షాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విరుపాక్షప్ప 88.49 శాతం ఓట్లు పొంది ఎస్పీ అభ్యర్థి భీంసేన్‌రావుపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.
*  అత్యధికంగా హింగోలి స్థానం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
*  77 స్థానాల్లో పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 39.59 శాతం ఓట్లతో 42 స్థానాల్లో విజయం సాధించింది. అందులో 35 స్థానాలు తెలంగాణలోనివే.
*  97 స్థానాల్లో పోటీ చేసిన సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలు గెలుచుకోగా ఆ 11 స్థానాలు తెలంగాణలోనివే.
*  షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్‌సీఎఫ్) ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే తెలంగాణలో సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్(ద్విసభ స్థానాల్లో ఒక్కొక్కటి) మూడింటా విజయకేతనం ఎగరేసింది.
*  హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తే, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పీడీఎఫ్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు.
*  హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 54.34 శాతం ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ఎల్.ల క్ష్మారెడ్డిపై గెలుపొందారు.
*  తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి భువనగిరి శాసనసభ స్థానం నుంచి 55.12 శాతం ఓట్లు సాధించి తన సమీప బంధువు, ప్రథమ భూ దాత, తన బావ వెదిరె రామచంద్రారెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు.
 * ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు వివిధ సమయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వికారాబాద్ స్థానం నుంచి మర్రి చెన్నారెడ్డి, అలంద్ నుంచి వీరేంద్రపాటిల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు.
*  వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి (కాంగ్రెస్) గెలుపొందగా, షాబాద్ నుంచి కొండా వెంకట రంగారెడ్డి 77.62 శాతం ఓట్లతో విజయం సాధించారు.
 
 నెహ్రూను మించిన... రావి మెజారిటీ
 తొట్టతొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజానీకం హైదరాబాద్ రాష్ట్ర ఫలితాలను ఆసక్తిగా గమనించింది. 25 లోక్‌సభ (4 ద్విసభతో కలిపి) స్థానాలున్న రాష్ట్రంలో 13 స్థానాల్లో కాంగ్రెస్, ఏడు స్థానాల్లో పీడీఎఫ్, రెండు స్థానాల్లో సోషలిస్ట్‌లు మరో మూడు స్థానాల్లో ఇతరులు గెలి చారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక ఓట్లను పొందారు. ఆ ఎన్నికల్లో ఆలహాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూ 2,33,571ఓట్లు పొందగా, రావి నారాయణరెడ్డికి 3,09,162(పీడీఎఫ్) ఓట్లు పోల్ కావడం ఓ రికార్డ్.
     అలాగే గుల్బర్గా స్థానం నుంచి రామానందతీర్థ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికవ్వగా, హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆహ్మద్ మోహినోద్దిన్ చేతిలో పీడీఎఫ్ అభ్యర్థి ముగ్దూం మోహియుద్దిన్ ఓటమి పాలయ్యారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రజాకవి కాళోజి నారాయణరావు మూడున్నర వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో పరాజయం పాలయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement