![Bandi Sanjay Kumar Requests Central Ministers To Bring Back Telangana People From Gulf - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/12/Bandi_0.jpg.webp?itok=g9mdAfn2)
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వి.మురళీధరన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ గురువారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోందని, ఇందులో భాగంగా అనేక మంది తెలంగాణవాసులను స్వదేశానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. అయితే గల్ఫ్ దేశాల్లో సుమారు 10 లక్షల మంది తెలంగాణవాసులు పని చేస్తున్నారని, వారిలో బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారంతా స్వదేశానికి రాలేక గల్ఫ్‌లోనే చిక్కుకుపోయి దీనావస్థలో ఉన్నారని తెలిపారు. దీంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని వివరించారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా తక్షణమే మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తెలంగాణవాసులను స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని కోరారు. లేఖలను ఈమెయిల్ ద్వారా కేంద్ర మంత్రులకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment