ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తాం | Competent, corruption-free regime provide | Sakshi
Sakshi News home page

ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తాం

Published Sun, Jan 26 2014 2:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Competent, corruption-free regime provide

కామారెడ్డి, న్యూస్‌లైన్ :  తెలంగాణ ప్రజల నాలుగున్నర దశాబ్దాల పోరాటా లు, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీజే పీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివా రం సాయంత్రం కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ  సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అదే సమయంలో నరేంద్రమోడీ, బీజేపీలకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడితే అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. సుసి ్థర, సమర్థవంతమైన, అవినీతిరహిత పాలనకోసం వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్, నిజామాబాద్ ఎంపీ స్థానాలతో పాటు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

 టీఆర్‌ఎస్‌తో దోస్తీ ఎందుకు కట్టారు
 ‘అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. రాష్ట్రం విడిపోతే నష్టాలను వివరించారు. అయితే 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ విషయాలు తెలియవా? అప్పుడు పొత్తును ఎందుకు అడ్డుకోలేదు’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

 కలిసుంటే లేదు సుఖం
 సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంతో నష్టపోయిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సాగు భూములకు నీళ్లు లేక, కరెంటు సరఫరా కాక ఈ ప్రాంత రైతులు అనేక అవస్థల పాలై గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అక్కడా నష్టాలపాలై పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి శవాలను తేవడానికి కూడా ఈ ప్రభుత్వాలు ప్రయత్నించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అనేక నష్టాలకు గురిచేసిందన్నారు. తెలంగాణ కోసం వేలాది మందిని జైళ్లపాలు చేసిందని, ఎందరో కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు.

 ఆందోళన వద్దు..
 సవరణల పేరుతో తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ పెట్టి, అసెంబ్లీలో ఓడించే కుట్రలు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటులో బీజేపీ తెలంగాణ బిల్లును గెలిపిస్తుందని పేర్కొన్నారు.

 సమర్థతకు, అసమర్థతకు పోరాటం
 వచ్చే ఎన్నికల్లో సమర్థతకు, అసమర్థతకు పోరాటం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసరాలు, పెట్రోల్, వంటగ్యాస్, ఎరువులు, ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు... ఇలా అన్నింటి ధరలు పెంచి పేద, మధ్యతరగతిపై మోయలేని భారాన్ని మోపిందని ఆరోపించారు. అన్నింటా అవినీతికి పాల్పడుతోందన్నారు. తాగేందుకు నీళ్లివ్వని ప్రభుత్వం మద్యాన్ని మాత్రం ఊరూరా పారిస్తోందంటూ విమర్శించారు.

 బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాయన్నారు. అక్కడ కరెంటు సమస్య లేదన్నారు. పారిశ్రామికవేత్తలు అక్కడికి పరుగులు పెడుతున్నారంటే అక్కడ నీతివంతమైన పాలన, నాణ్యమైన కరెంటు ఇవ్వడమే కారణమన్నారు. అవినీతి నిర్మూలన జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.

 ఇప్పుడేమైనా 24 గంటలిస్తున్నారా?
 తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు సమస్య ఉంటుందని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని, ఇప్పుడేమైనా కరెంటు 24 గంటలు ఇస్తున్నారా అని బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే గుజరాత్‌లాగే కరెంటును మెరుగుపర్చుకుంటామన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని, తమ పార్టీ బిల్లును పాస్ చేయిస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలను తీరుస్తుందన్నారు.

 సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు ధర్మారావ్, లోక భూపతిరెడ్డి, మోతె కృష్ణాగౌడ్, ప్రభాకర్ యాదవ్ మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు పెద్దోళ్ల గంగారెడ్డి, విఠల్‌గుప్తా, బాపురెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఆలూర్ గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, పుల్లూరి సతీశ్, సుధాకర్, రంజిత్ మోహన్, హరిస్మరణ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, టక్కర్ హన్మంత్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, లింబాద్రి, లింగారెడ్డి, గీతారెడ్డి, సంగారెడ్డి, శైలజ, వసుధారెడ్డి, తదితరులు పాల్గొనారు.

 షబ్బీర్ హస్తం
 తిరుపతిలో ఇస్లామిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ హస్తం ఉందని నిట్టు వేణుగోపాల్‌రావు ఆరోపించారు. షబ్బీర్‌అలీ నియోజకవర్గ అభివృద్ధి చేసిందేమీ లేదని, ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల అభివృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సైతం ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. షబ్బీర్‌అలీపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌గౌడ్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. పండుగలు కూడా జరుపుకోకుండా టపాకాయలు అమ్మడాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement