ఎన్నికల టైంలో ఉంటే బెటర్!
బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిలో ఈ మధ్య వేదాంతధోరణి కనబడుతుండడంపై పార్టీ నాయకుల్లోనే చర్చ జరుగుతోందట. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనా, తెలంగాణ ఏర్పడ్డాక ఆ పదవిని చేపట్టినందున ఆయనకు మరోసారి ఈ పదవి దక్కే అవకాశాలు కొంతమేరకున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే ఆయన వ్యతిరేకవర్గం జాతీయస్థాయిలో ఈ పదవి రాకుండా బలంగా పావులు కదుపుతోందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తనకు మరో అవకాశం వచ్చినా రావొచ్చునని, రాకపోయినా వచ్చే ఇబ్బందేమీ లేదన్న విధంగా ఆయన తన సన్నిహితుల వద్ద మాట్లాడుతున్నారట.
మరోసారి ఆయనకు అధ్యక్షపదవి దక్కకపోయినా మాజీ అధ్యక్షుడిగా మాత్రం ఎప్పటికీ మిగిలిపోతారని, ఆ హోదా నుంచి ఆయనను ఎవరూ తప్పించలేరు కదా అని ఆయన అనుకూలవర్గం నేతలు సర్దిచెప్పుకుంటున్నారట. ఇదిలా ఉంటే గతంలో రెండు, మూడుసార్లు బీసీ కార్డుతో అధ్యక్షపదవి కోసం గట్టిగా ప్రయత్నించి విఫలమైన ఒక ముఖ్యనే త సైతం ఇప్పుడు ఈ పదవి పట్ల ఏమాత్రం సుముఖత చూపడం లేదట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం తనకు అధ్యక్షపదవి కావాలని సదరు బీసీనేత గట్టిగానే కోరుకుంటుండగా, కిషన్‌రెడ్డి కూడా ఈసారి అధ్యక్ష పదవి లభించకపోయినా ఎన్నికలకు ముందుమాత్రం ఆయనకే అవకాశం లభించాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారట.
అయితే ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన ఒకనేత మాత్రం అధ్యక్షస్థానం కోసం ఢిల్లీస్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి తన ప్రయత్నాల్లో ఆయన విజయవంతం కూడా కావొచ్చునని ఆ పార్టీనేతలే అంగీకరిస్తున్నారట. ఒకసారి ఈ పదవి లభిస్తే రెండోటర్మ్ కూడా ఆయననే కొనసాగిస్తే ఎన్నికలపుడు ఆయనే కొనసాగడం తథ్యమని పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెవులు కొరుక్కుంటున్నారట...!