‘భారత్‌ది దాడి కాదు.. ఆత్మరక్షణ చర్య’
హైదరాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) లోని ఉగ్రవాద క్యాంపులపై భారత ఆర్మీ చేసింది ప్రతీకార చర్య కాదని, అది కేవలం ఆత్మరక్షణ చర్యలో భాగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పీఓకేలో క్యాంపులు పెట్టడంతోనే మన దేశంపై ఉగ్ర దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో భారత్‌పై ఉగ్ర దాడులు జరగకుండా ఆర్మీ ఎదుర్కుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ దాడుల విషయంలోఆర్మీ జనరల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తారన్నారు. దేశ రక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఆర్మీ దాడులు అభినందనీయం: బీజేఎల్పీనేత కిషన్‌రెడ్డి
భారత సైన్యం సరిహద్దు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం అభినందనీయమని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా భారత ఆర్మీ వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఈ దాడుల ద్వారా భారత్ తమ దాయాదిని హెచ్చరించిందని కిషన్ రెడ్డి చెప్పారు.