నేతల దందాలపై సీఎం ఆరా? | kcr to be meet si, ci's | Sakshi
Sakshi News home page

నేతల దందాలపై సీఎం ఆరా?

Published Fri, May 19 2017 2:09 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

నేతల దందాలపై సీఎం ఆరా? - Sakshi

నేతల దందాలపై సీఎం ఆరా?

నేడు హైదరాబాద్‌లో ఎస్సైలు, సీఐలతో ముఖాముఖి

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరా తీయనున్నట్లు తెలిసింది. మండల కేంద్రాల్లో పనిచేస్తూ.. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణను ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్ల (సీఐల)కు నేతల వ్యవహారాలపై సమాచారం ఉంటుందని.. అందువల్ల వారి నుంచి వివరాలన్నీ తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగనున్న పోలీసు కాన్ఫరెన్స్‌ను వేదికగా చేసుకోనున్నట్లు తెలిసింది. గ్రామస్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు చేస్తున్న దందాలపై నేరుగా పోలీసు అధికారుల నుంచే ఆరా తీయడంతోపాటు... ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనేదీ తెలుసుకోనున్నట్లు సమాచారం.

క్షేత్రస్థాయి సిబ్బందితో తొలిసారిగా..
పోలీసుశాఖలో తొలిసారిగా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ పోలీసు కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న హెచ్‌ఐసీసీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సదస్సు జరుగనుంది. ఎస్సై స్థాయి నుంచి డీజీపీ హోదా వరకు గల సుమారు 2,200 మంది దీనికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే వివరాలను సీఎం తెలుసుకోనున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సరైన రీతిలో చేరుతున్నాయా లేక అవినీతి, అక్రమాలతో పక్కదారి పడుతున్నాయా అన్నది ఆరా తీయనున్నారు.

అక్రమాలపై కఠినంగా..
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న గుడుంబా దందా, మట్కా కేంద్రాలు, పేకాట క్లబ్బులు, ఇసుక మాఫియా, వ్యభిచారం తదితర అంశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం సందేశం ఇవ్వనున్నారు. కొత్త జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితులు, భవనాల నిర్మాణం, సమస్యల పరిష్కారానికి మార్గాలపైనా చర్చించనున్నారు. కా>న్ఫరెన్స్‌ సందర్భంగా పోలీసు శాఖ ఇప్పటివరకు సాధించిన విజయాలపై ఫొటో ఎగ్జిబిషన్‌.. ఫింగర్‌ ప్రింట్స్, సెక్యూరిటీ వింగ్, ఫోరెన్సిక్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ వంటి విభాగాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలను కూడా సీఎం కేసీఆర్‌కు వినిపిస్తామని చెప్పారు.

‘శాంతిభద్రతల’కే ఆహ్వానంపై కినుక..
పోలీస్‌ కాన్ఫరెన్స్‌కు కేవలం శాంతిభద్రతల విభాగంలో పనిచేస్తున్న అధికారులనే ఆహ్వానించడంపై పోలీసు శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాంతిభద్రతలకన్నా కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని కూడా పట్టించుకోకపోవడం ఆయా అధికారుల్లో నిరాశ నెలకొన్నట్లు తెలుస్తోంది. కీలక విభాగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చినా.. వారితో సీఎం ముఖాముఖి లేకపోవడం బాధాకరమని కొందరు అధికారులు పేర్కొన్నారు. ఆయా విభాగాల నుంచి కనీసం డీఎస్పీ, ఆ పైస్థాయి హోదా గల అధికారులనైనా పిలిచి ఉంటే బాగుండేదని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement