నిరసన పేరిట బర్రెను పబ్లిగ్గా నరికేశారు!
- యూత్ కాంగ్రెస్ కార్యర్తల తీరుపై ఆగ్రహం
తిరువనంతపురం: ఆవుల అమ్మకాలపై ఆంక్షలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏకంగా ఒక బర్రెను బహిరంగంగా నరికి చంపిన ఘటన కేరళలో దుమారం రేపుతోంది. ఈ ఘటనలో పలువురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఆదివారం కేసు నమోదుచేశారు. కబేళాలకు ఆవుల అమ్మడాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగంగా ఓ బర్రెను వారు తెగనరుకుతున్న వీడియోను కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనాం రాజశేఖరన్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు.
ఇది అత్యంత అమానుషమని, సామాన్య వ్యక్తులెవరూ ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. సీపీఎం సైతం ఈ నిరసనను తప్పుబట్టింది. ఇలాంటి మూర్ఖమైన నిరసనలను మానుకోవాలని, ఇలా చేయడం సంఘ్ పరివార్‌కే మేలు చేస్తుందని సీపీఎం ఎంపీ ఎంబీ రాజేశ్ తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిరసనను ఖండించింది. ఈ నిరసన ప్రదర్శనతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఇలా చేయడం అనాగరికం, తనకు, కాంగ్రెస్ పార్టీకి ఇది ఆమోదయోగ్యం కాదంటూ ఖండించారు. మరోవైపు ఈ నిరసన ప్రదర్శనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ చర్యపై ఏమాత్రం విచారం వ్యక్తం చేయడం లేదు.