కొచ్చి: అత్యాచార నిందితుడికి మరణ శిక్షను ఖరారు చేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కింది కోర్టు విదించిన అదే శిక్షను సమర్ధించింది. తమిళనాడుకు చెందిన గోవిందా చామియా అనే యువకుడు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై విచారించిన పీ.ఆర్.రామచంద్రన్ నాయర్ మరియు పి. కమల్ పాషాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ప్రకటించింది. అత్యాచార నిందితుడు చామియాకు మరణ శిక్షతో పాటు రూ.లక్ష చెల్లించాలని తెలిపింది. ట్రైన్లో రేప్లకు గురౌతున్న వారిని రక్షించడానికి భారత రైల్వేలు, న్యాయవాదులు, తోటి ప్రయాణికులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని పేర్కొంది.
2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 1 వ తేదీన ట్రైన్లో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతి వద్ద ఓ యువకుడు ప్రేమ ప్రస్తావన తెచ్చి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కాగా దీనికి ఆ యువతి నిరాకరించడంతో కదులుతున్న ట్రైన్ లోంచి ఆమెను తోసేసిన అనంతరం అతను కూడా దూకేశాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను రాయితో తలపై బలంగా మోది అత్యాచారం చేశాడు.ఆమె చికిత్స పొందుతూ అదే సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన మరణించింది.
ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో కింది కోర్టు చామియాకు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును హైకోర్టు సమర్ధిస్తూ అతనికి మరణశిక్ష పబబేనని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు తోటి ప్రయాణికులు అండగా నిలవకపోవడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి సంఘటనలపై భారతీయ రైల్వేలు కూడా సరైన చర్యలు చేపట్టకపోవడాన్ని విమర్శించింది.