కింగ్‌ఫిషర్ హౌస్ స్వాధీనం
ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయ్ మాల్యా యూబీ గ్రూప్‌పై బ్యాంకులు కొరడా ఝులిపిస్తున్నాయి. బకాయిల వసూలు చర్యల్లో భాగంగా కింగ్‌ఫిషర్ హౌస్‌ను మంగళవారం స్వాధీనం చేసుకున్నాయి ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా. మూతబడిన మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి దాదాపు 20 బ్యాంకులకు మొత్తం రూ.6,800 కోట్ల మేర రుణ బకాయిలు(వడ్డీ కాకుండా) రావాల్సి ఉంది. దీనికోసం కొన్ని బ్యాంకులు ఆయనపై ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను కూడా వేయడం.. మాల్యా దీన్ని సవాలు చేయడం జరిగాయి.
కింగ్‌షిషర్ ఎయిర్‌లైన్స్‌కు అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన కింగ్‌ఫిషర్ హౌస్ విస్తీర్ణం 17,000 చదరపు అడుగులు. ఇది ఇక్కడి దేశీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు దగ్గర్లోని విలే పార్లేవద్ద ఉంది. యూబీ గ్రూప్‌లో కీలక కంపెనీగా వెలుగొందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూసివేత తర్వాత బ్యాంకులు 2013 ఫిబ్రవరిలోనే బకాయిల రికవరీ ప్రక్రియకు తెరతీశాయి. 2012 అక్టోబర్‌లో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్‌లో ప్లయింగ్ లెసైన్స్ కూడా రద్దయింది. కాగా, తమ రుణదాతలకు కన్సార్షియంగా వ్యవహరిస్తున్న ఎస్‌బీఐక్యాప్ ట్రస్టీకి కింగ్‌ఫిషర్ హౌస్ ప్రాపర్టీని స్వాధీనం చేసినట్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, కింగ్‌ఫిషర్ హౌస్ స్వాధీనాన్ని ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్(మొండిబకాయిల నిర్వహణ) ప్రవీణ్ కుమార్ మల్హోత్రా ధ్రువీకరించారు. ఇదే ప్రాపర్టీని ఆదాయ పన్ను, సేవల పన్ను విభాగాలు కూడా తమ బకాయిల వసూలుకోసం జప్తు చేసిన విషయంపై మల్హోత్రా మాట్లాడుతూ.. సంబంధిత పన్నుల విభాగాలతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.350 కోట్లు బకాయిపడిందని.. ఐటీ చట్టం కింద కింగ్‌ఫిషర్ హౌస్‌ను అటాచ్ కూడా చేసిన నేపథ్యంలో తమ బకాయిలను ముందుగా సెటిల్ చేసిన తర్వాతే ఈ బిల్డింగ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్లేలా బ్యాంకులను ఆదేశించాలంటూ ఐటీ శాఖ 2013 డిసెంబర్‌లో బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది.