సొరంగంలో ఆగిన మెట్రో రైలు
కోల్‌కతాలో ఘటన
రెండు గంటలు రైల్లో చీక ట్లో జనం నరకయాతన
నిచ్చెన్లు వేసి ప్రయాణికులను రక్షించిన మెట్రో సిబ్బంది
కోల్‌కతా: కోల్‌కతాలో డమ్‌డమ్ విమానాశ్రయానికి వెళ్తున్న నాన్‌ఏసీ మెట్రోరైలు సాంకేతిక లోపంతో ఒక సొరంగంలో ఆగడంతో వందలాదిమంది ప్రయాణికులు దాదాపు రెండు గంటలపాటు చీకట్లో చిక్కుకుపోయారు. పార్క్‌స్ట్రీట్, మైదాన్ స్టేషన్ల మధ్య సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆగిపోయిన రైల్లో,. విద్యార్థులు, ఆఫీసులకెళ్లే సిబ్బంది ఉదయం 11-25నుంచి రెండుగంటలపాటు చీకట్లోనే మగ్గిపోయారు. మెట్రో అధికారులు వారిని రక్షించేవరకూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు. సొరంగంలో చిక్కుకుపోయిన రైలుకు రెండు చివర్లలో పట్టాలపైకి నిచ్చెనలువేసిన మెట్రో అధికారులు, ప్రయాణికులను రైలునుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రైలు చిక్కుకుపోయిన రెండు గంటలూ ఆ మార్గంలో ఇతర సర్వీసులకూ అంతరాయం కలిగింది. రైళ్లులేక వేలాదిమంది ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు.
సొరంగంలోకి ప్రవేశించి, అకస్మాత్తుగా ఆగిన రైళ్లో కరెంట్‌లేక, లైట్లు, ఫ్యాన్లు పనిచేయక, ఊపిరాడక చీకట్లో చిక్కుకున్నామని, కొందరైతే అస్వస్థులయ్యారని ప్రయాణికుడొకరు తెలిపారు. ఇది తమకు చాలా భయానకమైన అనుభవమని, అధికారులు తమను ఎలా రక్షిస్తారన్న ప్రకటనలు కూడా లేకపోవడంతో,తాము ఎంతో ఆదుర్దా పడ్డామని, తమను బయటకు తీసుకువచ్చే వరకూ చీకట్లోనే మగ్గిపోయామని ప్రయాణికుడొకరు పీటీఐ ప్రతినిధికి చెప్పారు. చివరకు ప్రయాణికులందరినీ రైలునుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన మెట్రో అధికారులు,.. వారిని పార్క్ స్ట్రీట్ స్టేషన్‌కు తరలించారు.
అయితే, ప్రయాణికుల ఆరోపణలను మెట్రో అధికారులు ఖండించారు. సొరంగంలో రైళ్లో చిక్కుకుపోయినవారిని బయటకు తెచ్చేందుకు తమ సహాయక బృందం హుటాహుటిన రంగంలోకి దిగిందన్నారు. ప్రయాణికులను ఖాళీ చేయించేందుకే విద్యుత్ సరఫరాను నిలిపివేశామని, సొరంగానికి రెండువైపులా నిలిచిపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైలు సర్వీసులను నడిపామన్నారు. జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు మెట్రో రైల్వే సీపీఆర్‌ఓ ఆర్‌ఎన్ మహాపాత్ర చెప్పారు.