కృష్ణా పుష్కరాలు ఆర్టీసీ, రైల్వేలకు కాసులు కురిపించాయి.
రైల్వేకు రూ.47 కోట్లు..ఆర్టీసీకి రూ.7 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు ఆర్టీసీ, రైల్వేలకు కాసులు కురిపించాయి. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పుష్కరాలకు తరలి వెళ్లారు. పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 12 నుంచి 23 వరకు మొత్తం 691 స్పెషల్ సర్వీసులు నడపగా.. రద్దీ దృష్ట్యా 4,871 అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సుమారు 41 లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగించారు.
దీంతో రూ.47 కోట్ల వరకు ఆదాయం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ఇక హైదరాబాద్ నుంచి వివిధ పుష్కరఘాట్లకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ 1,500కుపైగా అదనపు బస్సులు నడిపింది. సుమారు 8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించినట్లు అధికారుల అంచనా. అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7 కోట్లకుపైగా ఆదాయం లభించినట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వేణు తెలిపారు.