నాలుగూ ముఖ్యమే?
* కృష్ణా జలాల్లో తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల వాదనలు వినాల్సిందే!
* పునఃపంపకాలపై తెలంగాణ వినతిని సానుకూలంగా పరిగణించిన కేంద్ర జల వనరుల శాఖ
* కేంద్ర మంత్రికి అధికారుల నివేదిక... అనంతరం కోర్టుకు అఫిడవిట్
* వచ్చే నెల 3న సుప్రీంకోర్టు ముందు వాదన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల కేటాయింపు నాలుగు రాష్ట్రాలకూ సంబంధించిన అంశమే అని సుప్రీంకోర్టుకు చెప్పాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
నదీజలాల వివాదంపై ఏర్పడిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిపై ఏడాదిన్నరగా ఏటూ తేల్చక స్తబ్దుగా ఉన్న కేంద్రం ఆ వివాదాన్ని ముగించేలా పరిష్కారాన్ని కనుగొన్నట్టు సమాచారం. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని వచ్చేనెల 3న జరుగనున్న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించాలని పేర్కొంటూ కేంద్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు సంబంధిత శాఖ మంత్రి ఉమాభారతికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేంద్రమంత్రి తుది నిర్ణయం అనంతరం కేంద్రం కోర్టుకు అఫిడవిట్ సమర్పించే అవకాశం ఉంది.
న్యాయశాఖ సలహా మేరకే..
కృష్ణా జలాల పునఃకేటాయింపులు జరపాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఏడాది క్రితమే కేంద్రానికి విన్నవించుకున్నా ఇప్పటివరకు దానిపై స్పందించలేదు. కేంద్రం వైఖరితో విసుగు చెందిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
‘రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్(బి)లకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ అవసరాలకు సంబంధించి, ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టమైన సూచనలు చేయలేదు.. ఈ దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది’ అంటూ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
దీనిపై గత నెలలో విచారణ జరిపిన సుప్రీం వారం రోజుల్లో తన వైఖరి ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కదిలిన కేంద్ర జల వనరుల శాఖ న్యాయశాఖ సలహా కోరింది. వివాదాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం అటార్నీ జనరల్ నాలుగు రాష్ట్రాల వాదనలు వినాల్సిన అవసరాన్ని జల వనరుల శాఖకు నొక్కి చెప్పినట్టు తెలిసింది.
కొత్త రాష్ట్రానికి అవకాశం లేకుంటే అన్యాయమే..?
న్యాయ సలహాపై సమావేశమైన కేంద్ర జల వనరుల శాఖ బృందం ట్రిబ్యునల్ పరిధు లపై పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు తెలిసింది. ట్రిబ్యునల్ తీర్పు ఎగువ రాష్ట్రాల వాదనకే మొగ్గుచూపిందని, నీటి లభ్యతను 75 శాతం నుంచి 65 శాతం మేర లెక్కించిందన్న తెలుగు రాష్ట్రాల వాదనపై ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తోంది.
నిజానికి మిగులు జలాలను ఆధారం చేసుకునే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నీటిని ఎగువ రాష్ట్రాలకూ పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. దీనిపై కొత్త రాష్ట్రం వాదనలు వినిపించే అవకాశం ఇంతవరకూ రాలేదు. దీనిని సవరించాలంటే తెలంగాణ వాదనతో కలిపి మిగతా రాష్ట్రాల వాదనలు వినాలని, ఆ దిశగా ట్రిబ్యునల్‌కు సూచనలు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.