ఆర్జేడీలో చీలికకు నితీశ్ కుట్ర: లాలూ
పాట్నా: తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ కుట్రపన్నుతున్నారని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఇందుకోసం స్పీకర్‌ను పావుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘బీజేపీతో విడాకుల అనంతరం నితీశ్‌కుమార్‌కు పిచ్చిపట్టినట్లుంది.
మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను మంత్రి పదవులతో ఆకర్షిస్తున్నారు’’ అని ధ్వజమెత్తారు. అయితే నితీశ్ చర్య బెడిసికొట్టిందన్నారు. పార్టీ నుంచి చీలిక వర్గంగా ఏర్పడ్డారన్న ఆరోపణలను 13 మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది తోసిపుచ్చారని చెప్పారు. తొమ్మిది మంది ‘చీలిక’ ఎమ్మెల్యేలతోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో కలసి మంగళవారం ఆయన పాట్నాలోని అసెంబ్లీ భవనం వరకూ పాదయాత్రగా వెళ్లారు.