రామేశ్వరం: తమిళనాడు రాష్ట్రానికి చెందిన 16 మంది మత్య్సకారులను శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేశారని మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. సదరు మత్స్యకారులంతా ఈ రోజు ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి... చేపల వేట చేస్తున్నారని తెలిపారు. దాంతో వారిని శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
అలాగే వారికి సంబంధించిన 3 బోట్లను కూడా వారు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వివరించారు. అరెస్ట్ అయిన మత్స్యకారులంతా పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని మత్స్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే సెల్వరాజ్ అనే మత్స్యకారుడు గత రాత్రి మరణించాడని....అతడి మృతదేహం బోట్లో ఉందని చెప్పారు. అతడి మరణానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు.