'కేరళ బార్లకు సెప్టెంబర్ 12న లాస్ట్బెల్'
తిరువనంతపురం: కేరళ మందుబాబులకు ప్రభుత్వం చేదు వార్త అందించింది. సెప్టెంబర్ 12 నుంచి మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించనున్నట్టు ఊమెన్ చాందీ సర్కారు ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న 730 బార్లలో 418 బార్ల లైసెన్సులు పునరుద్దరించలేదని ఎక్సైజ్ మంత్రి కె. బాబు తెలిపారు. మిగిలిన 312 బార్లు, 20 స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలను వచ్చే నెల 12 నుంచి నిషేధించనున్నట్టు ప్రకటించారు. వీటికి 15 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.
పదేళ్లలో దశలవారీగా మద్యనిషేధం అమలుచేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాము చేపట్టబోయే కొత్త ఎక్సైజ్ విధానాన్ని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై నిర్ణయాన్ని కోర్టు సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.