పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
రేపటి బంద్ వ్యూహంపై టీపీసీసీ ముఖ్యుల భేటీ
హైదరాబాద్: పంట రుణాలను ఒకేసారి మాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ, ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 10న నిర్వహించనున్న బంద్ విజయవంతానికి అనురించాల్సిన వ్యూహంపై గురువారం టీపీసీసీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. అనంతరం నేతలతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని విమర్శించారు. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రమని, ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్‌కు రైతుల కష్టాలు కన్పించడం లేదన్నారు. లక్ష కోట్ల బడ్జెట్‌లో రైతుల రుణమాఫీ చేయడానికి ఆయనకు చేతులు రావడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 90 వేల కోట్లు, వాటర్ గ్రిడ్‌కోసం 30 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు మూడేళ్లలో 75 వేల కోట్లు ఖర్చుచేస్తామంటున్నారు... కానీ, రైతుల కోసం కేవలం 8 వేల కోట్లు ఖర్చుచేయలేరా అని ప్రశ్నించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తక్కువ చేసి చూపించే యత్నాలు జరుగుతున్నాయని, గ్రామసభలు ఏర్పాటుచేసి వాటిని నిర్దారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలసి ఈనెల 10న పెద్ద ఎత్తున బంద్ నిర్వహిసున్నట్టు ఉత్తమ్ చెప్పారు. సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పార్టీ నేతలు దానం నాగేందర్, ఎం.అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు భారీ ప్రదర్శన
10న జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఉత్తమ్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తెలిపారు. బంద్ ఏర్పాట్లు, వ్యూహంపై గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ఉత్తమ్ సమావేశమయ్యారు.